హైకోర్టు చెప్పినా స్పందించరా..?

Jan 3,2024 09:07

తహశీల్దార్‌ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న సిపిఎం, వ్యకాసం నాయకులు

       పెనుకొండ : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అధికారులు దానిపై స్పందించరా అంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ ప్రశ్నించారు. పెనుకొండ పట్టణంలో ఇళ్లు లేని పేదలకు తక్షణం ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్‌ మాట్లాడుతూ పెనుకొండలో అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని హైకోర్టు తీర్పును వెలువరించిందన్నారు. దీనిని అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి దరఖాస్తు చేసుకున్న 190 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, లేకుంటే దీనిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. సమస్యను వినేందుకు అధికారులెవరూ బయటకు రాకపోవడంతో పేదలతో కలిసి డిప్యూటీ తహశీల్దార్‌ గదిలోకి వెళ్లి బైటాయించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. స్పందించిన తహశీల్దార్‌ వారివద్దకొచ్చి మాట్లాడారు. వెంటనే సర్వే చేయించి పేదలకు పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా నాయకులు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, జిల్లా నాయకులు నారాయణ, వెంకట రాముడు, తిప్పన్న, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఉత్తప్ప, కిష్టప్ప, నరసింహులు, పట్టణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళ నాయకురాలు జయంతి, మణి, దివ్యభారతి, షబానా పేదలు పాల్గొన్నారు.

స్పృహతప్పి పడిపోయిన మహిళ

ఆందోళన సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ మహిల స్పృహతప్పి కిందపడిపోయింది. కోణాపురం గ్రామానికి చెందిన కొల్లమ్మ అనే మహిళ ఒక్కసారిగా కిందపడింది. దీంతో వెంటనే 108కు ఫోన్‌ చేశారు. 108 సిబ్బంది కార్యాలయంలోనే ఆమెకు ప్రథమ చికిత్స అందించారు.

➡️