హామీఇచ్చి మోసం చేస్తారా..?

పుట్టపర్తిలో నిరసన ర్యాలీ చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు

       పుట్టపర్తి రూరల్‌ : సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సమ్మెబాట పట్టారు. బుధవారం ఉదయం పుట్టపర్తి గణేష్‌ కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమగ్రశిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షాఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పీఆర్సీ అమలు చేయకుండా, నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఉద్యోగుల మధ్య విబేధాలు సష్టించే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండడం విచారకరం అన్నారు. ప్రాజెక్టులో ఒకే క్యాడర్‌ ఉద్యోగులకు రకరకాల వేతనాలు చెల్లిస్తుండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పాతవారికి జీతం పెంచకుండా, కొత్తగా నియమితులైన వారికి వేతనం పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని విభాగాల్లో కెజిబివి టీచర్లకు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సర్వశిక్షలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్ల సమయం పూర్తి కావస్తున్నా ఈ హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. సమగ్రశిక్షలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌, పార్ట్‌టైం ఉద్యోగులు విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చెయ్యాలన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సుధాకర్‌, ఎపిటిఎఫ్‌ ప్రసాద్‌ రెడ్డి, వైఎస్‌ఆర్టీపీ వి.రమణారెడ్డి, పిఆర్‌టియు రజనీకాంత్‌ రెడ్డి, ఏపీ పీఎఫ్‌ చంద్ర, ఏపీయుఎస్‌ సురేష్‌ బాబు, డిటిఎఫ్‌ గౌస్లాజీ తదితరులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్న, కార్యదర్శి ముకుంద, రవి, శ్రీనివాసరావు, స్రవంతి, వెంకటరమణ, బాబ్జాన్‌ పాల్గొన్నారు.

➡️