హక్కుల కోసం ఐక్య పోరాటాలు : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

  •  పర్సా శతజయంతిని పురస్కరించుకుని సావనీర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి – గుంటూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సిఐటియు అగ్రనేత పర్సా సత్యనారాయణ స్ఫూర్తితో తమ హక్కుల సాధన కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. పర్సా శతజయంతిని పురస్కరించుకొని గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర సదస్సు సందర్భంగా ప్రచురించిన సావనీర్‌ను సోమవారం బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న వేతనాల పెంపు, ఎనిమిది గంటల పనివిధానం, ఇతర అనేక హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సిఐటియు నేతృత్వంలో అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఆశా, విఆర్‌ఎలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి కొన్ని హక్కులు సాధించుకున్నారని తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పర్సా సత్యనారాయణ శతజయంతి రాష్ట్ర సెమినార్‌ నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మధ్య తరగతి ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ వి.వి.కె.సురేష్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, బి.ముత్యాలరావు పాల్గొన్నారు.

➡️