స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలకు లండన్‌కు భారత ప్రతినిధి బృందం

Indian delegation London Free Trade Agreement

న్యూఢిల్లీ : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ)పై చర్చల కోసం భారత అధికార ప్రతినిధి బృందం లండన్‌ బయలుదేరనుంది. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తువులు, సేవలు, నిబంధనలు వంటి పలు అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల పురోగతిని ప్రధాన మంత్రి కార్యాలయం గత వారం సమీక్షించడంతో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయాలన్నింటినీ పరిష్కరించాలన్నదే ఈ పర్యటన ఉద్దేశ్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2022 జనవరిలో భారత్‌, బ్రిటన్‌లు ఈ చర్చలను ప్రారంభించాయి. ఇప్పటివరకు 13 దఫాలుగా చర్చలు జరిగాయి. గత నెల్లో 14వ దఫా చర్చలు మొదలయ్యాయి. ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బిఐటి)పై చర్చలు కూడా సాగుతున్నాయి. ఈ ఒప్పందంలో 26 చాప్టర్లు వున్నాయి. వాటిల్లో వస్తువులు, సేవలు, పెట్టుబడులు, మేథో సంపత్తి హక్కులు వంటివి వున్నాయి. ఐటి, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలకు చెందిన నైపుణ్యం కలిగిన తమ వృత్తి నిపుణులకు బ్రిటన్‌ మార్కెట్‌లో బాగా అవకాశాలు ఇవ్వాలని భారత పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. కస్టమ్స్‌ సుంకం లేకుండా అనేక వస్తువులకు కూడా మార్కెట్‌ సౌలభ్యత కావాలని కోరుతోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో 20.36 బిలియన్ల డాలర్లకు పెరిగింది.

➡️