స్వేచ్ఛగా ఓటు వేయండి

Mar 18,2024 22:04

ప్రజాశక్తి-వంగర  : ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. అతి సున్నిత ప్రాంతంగా గుర్తింపు పొందిన వంగర మండలం లక్షింపేటలో సోమవారం ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుల్లో కలెక్టర్‌, ఎస్‌పి దీపిక పాల్గొని, ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు. గ్రామస్తుల నుంచి వినతులు స్వీకరించారు.సదస్సులో కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. అందుకు తగిన వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన సంఘటనలను పునరావృతం కానీయబోమని హామీ ఇచ్చారు. ఓటర్లు భయబ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును వంద శాతం వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు బూత్‌ స్థాయి అవగాహనా గ్రూపులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతీ పది పోలింగ్‌ కేంద్రాలకు ఒక సెక్టార్‌ అధికారిని, పోలీసు శాఖ నుంచి కూడా మరో సెక్టార్‌ అధికారిని నియమించామని తెలిపారు. ఓటు వేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఈ గ్రూపు సభ్యులకు, సెక్టార్‌ అధికారులకు లేదా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్‌పి దీపిక మాట్లాడుతూ సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ఆయా గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు వేయడంలో ఏమైనా సమస్యలు ఎదురవుతాయని భావిస్తే, నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. గత ఎన్నికలో జరిగిన వివాదాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలను చేపట్టామన్నారు. దీనిలో భాగంగా కొందరిని బైండోవర్‌ కూడా చేశామన్నారు. సదస్సులో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, నియోజకవర్గ ఆర్‌ఒ జోసెఫ్‌, ఆర్‌డిఒ బి.శాంతి, డిఎస్‌పి చక్రవర్తి, సిఐ శ్రీనివాస్‌, తహశీల్దార్‌ టి.చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌
రేగిడి : మండలంలోని కాగితావలస పోలింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ నాగలక్ష్మి సోమవారం తనిఖీ చేశారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉన్న ఈ పోలింగ్‌ కేంద్రంలో కనీస వసతులను తనిఖీ చేశారు. అక్కడి ఓటర్ల సంఖ్య, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ఓటర్లకు పోలింగ్‌ రోజు ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రహరీ లేని పోలింగ్‌ బూత్‌ లకు చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తనిఖీలో ఎస్‌పి దీపిక, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, ఆర్‌డిఒ బి.శాంతి, తహశీల్దార్‌ జె.రాములమ్మ, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

➡️