స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

Feb 28,2024 21:36

ప్రజాశక్తి-విజయనగరం కోట :  స్థానిక సంస్థల పట్ల వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షులు వైవిబి రాజేంద్రప్రసాద్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆ సంఘం ఆధ్వర్యాన సర్పంచులు బుధవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. అనంతరం డిఆర్‌ఒ అనితకు వినతి అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ- పార్లమెంట్‌ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసిపిని ఓడిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులు, అధికారాలను, విధులను లాగేసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గత మూడేళ్లగా అనేక పోరాటాలు చేశామని తెలిపారు. అయినా ముఖ్యమంత్రి పట్టించు కోలేదన్నారు. మళ్లీ జగన్‌ ప్రభుత్వం వస్తే పల్లెలన్నీ నాశనమైపోతాయని ఆవేదన చెందారు. ఈనేపథ్యంలో గ్రామీణ ప్రజలు మనల్ని మనం కాపాడుకోవాలని కోరారు. వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు మాట్లాడుతూ రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు సర్పంచులు, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కంకణం కట్టుకోవాల న్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు, విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు సోము నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు చుక్క ధనుంజరు యాదవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్‌ రాజు, చింతకాయల ముత్యాలు, వానపల్లి ముత్యాల రావు తదితరులు పాల్గొన్నారు.

➡️