సెలవు రోజుల్లోనూ మిర్చి విక్రయాలు జరపాలి

Feb 22,2024 19:56

మిర్చి యార్డు ఛైర్మన్‌తో మాట్లాడుతున్న నాయకులు, రైతులు
ప్రజాశక్తి-గుంటూరు :
గుంటూరు మిర్చియార్డుకు మిర్చి అధికంగా వస్తున్నందున శని, ఆదివారాల్లోనూ విక్రయాలు చేపట్టాలని, ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం, కౌలురైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఎపి రైతు సంఘం, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకుల బృందం గురువారం గుంటూరు మిర్చియార్డును సందర్శించింది. రైతులతో నాయకులు మాట్లాడారు. మిర్చి ఎక్కువగా యార్డుకు రావటంతో ధర తగ్గించేశారని, శనివారం విక్రయాలు చేపట్టట్లేదని రైతులు తెలిపారు. ఇతర జిల్లాలు, దూరప్రాంతాల నుండి మిర్చిని విక్రయించుకోవటానికి వచ్చి, రెండు, మూడురోజులు ఇక్కడే ఉండాల్సి వస్తోందని వాపోయారు. అనంతరం నాయకులు, రైతులు మిర్చి యార్డు చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణను కలిసి సమస్యలను వివరించారు. మిర్చి రాక ఎక్కువగా ఉన్నందున శని, ఆదివారాల్లోనూ విక్రయాలు జరిగేలా చూడాలని కోరారు. తేజాకు రూ.20 వేలు ఉన్న క్వింటాళ్‌ ధర ఇప్పుడు రూ.16 వేలకు తగ్గించారని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ధరలు తగ్గకుండా చూడాలని కోరారు. స్పందించిన చైర్మన్‌ మాట్లాడుతూ వ్యాపారులతో సమావేశం నిర్వహించి, ఆయా సమస్యలపై చర్చిస్తామన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బృందంలో రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, అధ్యక్షులు వై.రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి.రామకృష్ణ ఉన్నారు.

➡️