సినిమా చూపిస్తూ ఆపరేషన్‌!

Feb 4,2024 00:15

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో న్యూరో సర్జరీ వైద్యులు రోగికి పోకిరి సినిమా చూపిస్తూ అరుదైన అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను ఉచితంగా చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం న్యూరాలజి సెమినార్‌ హాలులో విలేకర్లకు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురానికి చెందిన 48 ఏళ్ల పండు గతనెల రెండో తేదీన అపస్మారక స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. కుడి కాలు, కుడి చేయి బలహీన పడటంతో న్యూరో సర్జరీ ఓపీకి వచ్చారు. న్యూరో సర్జరీ వైద్యులు వివిధ పరీక్షలు చేసి ఆసుపత్రిలో 5వ తేదీన వార్డులో చేర్పించారు. ఎడమ వైపు మెదడు లో కుడి వైపున కాలు, చేయి పని చేసే మోటార్‌ కార్టెక్స్‌ భాగంలో కణితి ఉన్నట్లుగా స్కాన్‌లో వైద్యులు గుర్తించారు. అత్యంత సున్నిత భాగంలో ఉన్న ఆ కణితిని ఆపరేషన్‌ చేయాలనీ నిర్ణయించారు. ఈ ఆపరేషన్‌ చేయడం వల్ల పూర్తిగా కణితి తొలగించే పక్రియలో కుడి కాలు, చేయి పూర్తిగా చచ్చుబడి పోయే అవకాశం ఉంటుదని వైద్యులు భావించారు. ఈ ఆపరేషన్‌ చేయాలంటే రోగి మెలుకువగా ఉన్నప్పుడు, కదులుతున్నప్పుడు ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌కు సహకరించి ముందుకు రావడంతో రోగి అభిమాని హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమా చూపిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో న్యూరో సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కెవివి సత్యనారాయణ మూర్తి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు డాక్టర్‌ గడ్డలా పెంచలయ్య, డాక్టర్‌ సురేంద్రవర్మ, డాక్టర్‌ సత్య నవమి ,పిజి వైద్య విద్యార్థులు డాక్టర్‌ కషుణుడు, డాక్టర్‌ సాయితేజ, డాక్టర్‌ మౌంట్‌రాజ్‌, డాక్టర్‌ మహేష్‌, మత్తు వైద్య విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పోలయ్య, డాక్టర్‌ నాగభూషణం, డాక్టర్‌ ఆదిత్య ప్రదీప్‌, డాక్టర్‌ ఆనంద్‌ పాల్గొన్నారు. ఆపరేషన్‌ తర్వాత రోగికి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జి చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ చెప్పారు. రోగి కాలు చేయి బలహీనత పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణంగా ఉన్నారని తెలిపారు.

➡️