సిఐ అక్కేశ్వరరావుకు తీవ్ర గాయాలు

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ : కారును ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న ఘనటలో మార్టూరు సిఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాయుడుపేట – తిరుపతి రహదారిలో పెళ్లకూరు మండల పరిధిలోని కప్పగుండ కండ్రిగ గ్రామ సమీపంలో 71వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం వేకువ జామున చోటుచేసుకుంది. పెళ్లకూరు ఎస్‌ఐ కుర్రా శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం… బాపట్ల జిల్లా మార్టూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి.అక్కేశ్వరరావు అనంతపురంలో ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వెళ్లారు. అక్కడ విధులు ముగించుకొని మార్టూరు వస్తున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట సమీపంలోని పెళ్ళకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కప్పగుండ కండ్రిగ వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు కారును ఢకొీంది. దీంతో కారు ముందు భాగంగా మంటలు చెలరేగాయి. కారు ముందు సీట్లో కూర్చొని ఉన్న సిఐ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో పిఎం బందోబస్తుకు వెళ్లి వస్తున్న పెళ్లకూరు ఎస్‌ఐ శ్రీకాంత్‌ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే హైవే మొబైల్‌ పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక కేంద్రం సిబ్బందికి సమాచారం అందించారు. కారులో ఇరుక్కుపోయిన సిఐ అక్కేశ్వరరావుని పోలీస్‌ సిబ్బంది అతి కష్టం మీద బయటకు తీశారు. నాయుడుపేట నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన సిఐని 108 వాహనంలో నెల్లూరు అపోలో వైద్యశాలకు తరలించారు. పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న మార్టూరు ఎస్‌ఐ ముసలం శ్రీనివాసరావు హూటాహుటిన నెల్లూరు తరలి వెళ్లారు.

➡️