సిఎం ఆదేశిస్తే ఎంపిగా పోటీ

Feb 22,2024 21:29

సాలూరు: సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. పట్టణంలోని కోదండరామ కల్యాణమండపంలో మండలంలోని వాలంటీర్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపిగా చేయాలని ఉందన్న విషయాన్ని రాజన్నదొర ఇంతవరకు పలు సందర్భాల్లో చెప్పారు. కొద్దినెలల క్రితం సామాజిక సాధికారత బస్సు యాత్రకు ముందు ఆయన నివాసంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో కూడా తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆరోగ్యం బాగుండడం లేదని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెపుతున్నారని చెప్పారు. పిల్లల చదువులపై శ్రద్ద వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వ్యక్తిగత అంశాలపై దృష్టి సారించలేనన్నారు. అధిష్టానం దేనికి పోటీ చేయమంటే దానికే చేస్తానని చెప్పారు.టిడిపి గెలిస్తే వాలంటీర్‌ వ్యవస్థ ఎత్తేయొచ్చురాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రాకపోతే వాలంటీర్‌ వ్యవస్థను ఎత్తివేయొచ్చునని రాజన్నదొర చెప్పారు. మొదటి నుంచి ఈ వ్యవస్థకు టిడిపి, జనసేన నాయకులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థల వల్ల గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలందుతున్నాయన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే వెళ్లి పింఛను మొత్తాలను అందజేస్తున్న ఘనత వాలంటీర్లదేనన్నారు. సంక్షేమ పథకాలందుకుంటున్న లబ్దిదారుల కుటుంబాల్లో వాలంటీర్లు సభ్యులుగా మారారని చెప్పారు. కావున రానున్న ఎన్నికల్లో వైసిపిని గెలిపించకపోతే సంక్షేమ పథకాలతో పాటు సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి జి.రాములమ్మ, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, మండల వైసిపి అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు, జెసిఎస్‌ కన్వీనర్‌ కె.త్రినాధనాయుడు, ఎంపిడలొ ఫణీంద్రకుమార్‌, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.రాజన్నదొరకు టిడ్కో లబ్దిదార్లు సన్మానంపట్టణంలోని 26వార్డుకు చెందిన టిడ్కో ఇళ్ల లబ్దిదారులు గురువారం డిప్యూటీ సీఎం రాజన్నదొరను సన్మానించారు. వార్డు వైసిపి నాయకులు కర్రి అప్పలస్వామి ఆధ్వర్యాన లబ్దిదారులు రాజన్నదొరను ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్ష పండ్లులా ఉన్న టిడ్కో ఇళ్లను పేదలకు అందేలా చేయడంలో రాజన్నదొర కృషి మరువలేనిదని చెప్పారు. తమ కుటుంబాలకు సొంత ఇంటి కల సాకారం చేశారని ఆనందం వ్యక్తం చేశారు.

➡️