సావిత్రి బాయి పూలే జన్నదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

Jan 7,2024 20:56

ప్రజాశక్తి – బొబ్బిలిరూరల్‌ : సావిత్రి బాయి పూలే జన్మదినం జనవరి 3న జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించాలని యూటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు విజయగౌరి డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సావిత్రి బాయి ఫూలే జయంతి కార్యక్రమాలు యూటీఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి, మహిళా సబ్‌ కమిటీ కన్వీనర్‌ వి.రాధాభవానీ అధ్యక్షతన నిర్వహించారు. విజయగౌరి మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ తొలి మహిళా టీచర్‌ సావిత్రి బాయి అని, ఆమె ఆశయాలను అమలు చేయడం ప్రధాన కర్తవ్యమని అన్నారు. బడి పిల్లలను ప్రేమించాలని, చదువుతో పాటు సమాజ చైతన్యాన్ని నింపాలని చెప్పిన కార్యసాధకురాలు సావిత్రి బాయి పూలే అని గుర్తు చేశారు. ప్రధానంగా ఈ సమావేశంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేసి బడులను మూసి, ప్రైవేటికరణకు దోహదం పెడుతున్న పాలకులు విధానాలు సావిత్రి బాయి ఆశయాలకు విఘాతకం అని అన్నారు. ఆమె పూనే లో ఏర్పాటు చేసిన ఆనాటి బాలికల పాఠశాలలు శిధిలావస్థలో ఉన్నాయని వాటిని పున్ణ నిర్మించి ఒక చారిత్రక అంశంగా సజీవం చేయాలని, దీనిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. ఈశ్వరరావు మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే ఒక సామాజిక ఉద్యమకారిణి అని, నూతన విధానాన్ని రద్దు చేయించడమే నేటి విద్యా రంగం పరిరక్షణకు మలుపు అని అన్నారు. ఎంపిడిఒ రవికుమార్‌ మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే అందరికీ ఆదర్శనీయురాలని అన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల రాష్ట్ర కౌన్సిలర్‌లు జి.పద్మావతి, ఐ.రాజామణి, ఎస్‌.రాజకుమారి, వి.జ్యోతిలు మాట్లాడుతూ మహిళా టీచర్లు విద్యారంగంలో కీలక పాత్ర పోషించాలని పిలుపు నిచ్చారు. జిల్లా సహాధ్యక్షులు ప్రసన్నకుమార్‌ జిల్లా కార్యదర్శి కె.శ్రీదేవి చదువుతో పాటు నేటి సామాజిక అంశాలను విద్యార్థులకు తెలియచేసి చైతన్యాన్ని పెంచే భాద్యత మనదే అన్నారు. అనంతరం సావిత్రి బాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా టీచర్ల దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని, ఆమె జీవితం చరిత్రను పై స్థాయి వరకు పాఠ్యాంశంగా చేర్చాలని, ఆమె మొదటిసారిగా పూనేలో నిర్మించిన బాలికల పాఠశాలలు శిధిలావస్థలో ఉన్న కారణంగా వాటిని పున్ణ నిర్మాణం చేసి ఒక చారిత్రిక అంశంగా చూపాలని, ఫూలే ఆశయాలకు తిలోదకాలిచ్చే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని సభ తీర్మానాలను ప్రవేశపెట్టింది. అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా రామభద్రపురం హైస్కూల్‌, ఎలిమెంటరీ పూడి వీధి విద్యార్థులు సావిత్రి బాయి ఫూలే పై రచించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. పాఠశాలలో పరిరక్షణ, మహిళా టీచర్ల పాత్ర అనే అంశం పై జరిగిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన మహిళా టీచర్లు లావణ్య, శ్రీదేవి, లక్ష్మిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బొబ్బిలి, రామభద్రపురం మండలాల యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌, శంకరరావు, సుధాకర్‌, చంటి, స్వామినాయుడు, రామకృష్ణలతో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు, మహిళా టీచర్లు పాల్గొన్నారు.

➡️