సాధారణ ఎన్నికలకు సమాయత్తం

రానున్న సాధారణ

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • రాజకీయ పార్టీల సహకారం కీలకం
  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రానున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 32వ వారపు సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలకు జిల్లా యంత్రాంగ సన్నద్ధతను తెలిపేందుకే ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడా రీ పోలింగ్‌ లేకుండా ఉండడం, ఓటింగ్‌ శాతాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని… వెబ్‌ కాస్టింగ్‌, పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం కోసం ప్రణాళికలు పూర్తి చేశామని వివరించారు. స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్‌ కోసం కేటాయించిన కేంద్రాన్ని తనిఖీ చేశామని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులను దాదాపు పూర్తి చేశామన్నారు. నామినేషన్లకు చివరి రోజు వరకు ఓటరు జాబితాలో చేర్పులు, మార్పుల కోసం అవకాశం ఉందన్నారు. ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత మాత్రం తొలగింపు ప్రక్రియ నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఓటరు సహాయం కోసం 1950 టోల్‌ ఫ్రీ నంబరు పనిచేస్తుందని చెప్పారు. రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా గానీ ఫోన్‌ ద్వారా గానీ సలహాలు, ఫిర్యాదులు చేయదలుచుకుంటే ప్రత్యేకంగా ఈమెయిల్‌, ఫోన్‌ నంబరును కేటాయిస్తామని, వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఫారం-7 దాఖలు విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరిపై జిల్లాలో క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వ్యక్తులపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. తుది ఓటరు జాబితా ప్రకటన తర్వాత 0.1 శాతం మించి ఓటర్లను తొలగించడం సాధ్యం కాదన్నారు. గత వారం రోజుల్లో మార్పులు, చేర్పులు, ఇతర సవరణల కోసం 11,536 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ కలెక్టరేట్‌లో ఒక నోడల్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యాన నలుగురు ప్రత్యేక అధికారులతో మొత్తం 13 మంది సప్లిమెంటరీ జాబితా కోసం పనిచేస్తున్నారని వివరించారు. వీటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వి.ఎస్‌ రామ్మోహనరావు, వైసిపి నాయకులు రౌతు శంకరరావు, టిడిపి నాయకులు పి.ఎం.జె బాబు, కాంగ్రెస్‌ నాయకులు డి.మల్లిబాబు, బిజెపి నాయకులు సురేష్‌బాబు సింగ్‌, బిఎస్‌పి నాయకులు ఆర్‌.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️