సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి- స్నాతకోత్సవాల్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Jan 31,2024 21:50 #ap governer, #speech

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి:మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కాకినాడలో జెఎన్‌టియుకె, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నన్నయ యూనివర్శిటీ స్నాతకోత్సవాల్లో ఆయన బుధవారం పాల్గన్నారు. పిహెచ్‌డి అవార్డు గ్రహీతలు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను గవర్నర్‌ అభినందించారు. కాకినాడ జెఎన్‌టియుకె 10వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ జెఎన్‌టియుకె న్యాక్‌ ఎం గ్రేడ్‌, యుసిఇకె ఎన్‌ఐఎ గుర్తింపు సాధించినందుకు యూనివర్శిటీ అధికారులను ప్రశంసించారు. వికసిత్‌ భారత్‌ -2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలోని యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని తెలిపారు. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో విద్యా సంస్థల బాధ్యత ఎంతో ఉందన్నారు. ప్రజల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. జెఎన్‌టియుకె విసి జివిఆర్‌ ప్రసాదరాజు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి పాల్గని మాట్లాడారు. రాజమహేంద్రవరంలోని నన్నయ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సాధించిన జ్ఞానం ప్రపంచానికి ఉత్తమ పౌరులుగా వారిని అందిస్తుందని తెలిపారు. విసి ఆచార్య కె.పద్మరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పద్మభూషణ్‌ సుధా నారాయణమూర్తి, తెలుగు, సంస్కఅత అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు.

➡️