సమీక్షపోలమాంబా… అభివృద్ధి గురించి ఎవరికి మొక్కాలి!

Dec 15,2023 20:54

ప్రజాశక్తి – మక్కువ  :  మండలంలోని శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర స్థాయి జాతరగా ప్రభుత్వం గుర్తించినా ఆ దిశగా అభివృద్ధికి నోచుకోలేకపోవడంతో యాత్రికులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతి జాతర ముందు అధికారులు, రాజకీయ నాయకులు హడావుడి చేస్తూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప జాతరకు వచ్చే యాత్రికులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలపై శాశ్వత ప్రణాళికలు చేయడంలేదు. యాత్రికుల నుండి వచ్చే ఆదాయం తాత్కాలిక ఏర్పాట్లతో హారతి కర్పూరంలా కరిగిపోతుంది తప్ప ప్రయోజనం ఏమీ లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఏళ్ల తరబడి అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి నిలువు నీడ లేక అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే లక్షలాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న దేవాదాయ శాఖకు మాత్రం భక్తులు అవస్థలు పట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షలాదిగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కనీసం వందమందైనా కూర్చునే ప్రశాంతమైన చోటు లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. చదురు గుడి, వనం గుడిలను అభివృద్ధి చేస్తామంటూ ఏటా ప్రతిపాదనల మాట వినిపిస్తున్నప్పటికీ అవి పనుల రూపంలో కార్యరూపం దాల్చకపోవడం నేతి బీర మాటలు లాగే మిగిలిపోతుందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదికి ఒకటి చొప్పున శాశ్వత పని చేపట్టినట్లయితే ఈపాటికి ఆలయ అభివృద్ధి అమోఘంగా ఉండేదని పలువురు చర్చించుకుంటున్నారు. నామినేటెడ్‌ పదవుల కోసం ఆత్రం పడే స్థానిక నేతలు ఆలయ అభివృద్ధి విషయంలో అనుకున్నంత రీతిలో చిత్తశుద్ధి కనబరుచకపోవడంతో చదురు గుడి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిగా తయారైందని పలువురు ఆక్షేపిస్తున్నారు. కనీసం భక్తుల విశ్రాంతి కోసం శాశ్వత రేకు షెడ్‌ నిర్మించలేకపోవడం దేవాదాయశాఖకు యాత్రికులపై ఉన్న శ్రద్ధ ఎలా ఉందో అర్ధమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. జాతరకు నెల రోజులు ముందు నిర్వహించే సమీక్షల వల్ల ఆలయాలు అభివృద్ధికి ఒరిగేదేమీ లేదని పలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సంబర పోలమాంబ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.పాత బోర్డు.. ఉత్సవ కమిటీ..ఈ ఏడాది జాతర నిర్వహణ ఎలా ఉంటుందన్నది సందిగ్ధంగానే ఉంది. ఆలయ ట్రస్ట్‌ బోర్డు గడువు కాలం ముగిసిపోగా కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఈసారి జాతర నిర్వహణ ఎలా చేస్తారన్నది సస్పెన్షన్‌. పాత బోర్డు కొనసాగింపుగా జాతర కొనసాగిస్తారా లేక కొత్తగా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తారన్నది బహిర్గతం చేయాల్సి ఉంది. జాతర సమయం సమీపిస్తున్నప్పటికీ కొత్తగా నియమించిన ఇఒ ఇంకా పూర్తిగా ఆలయ వ్యవహారాలు అవగాహన చేసుకోవాల్సి ఉన్నప్పటికీ జాతర సక్రమ నిర్వహణకు స్థానిక నేతలతో చర్చలు జరిపి వారి సహకారం అర్జించాల్సిన పరిస్థితి ఉంది.నేడు జిల్లా కేంద్రంలో సమీక్షజనవరి 22, 23, 24 తేదీల్లో జరగనున్న శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు సంబంధించి పార్వతీపురంలో ఆర్‌డిఒ అధ్యక్షతన ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణపై పలు అంశాలు చర్చకు దారి తీయవచ్చు. ముఖ్యంగా దేవాదాయశాఖ ప్రతిష్టాత్మకమైన జాతరకు శాశ్వతమైన కార్యనిర్వహణ అధికారిని నియమించకపోవడం, ఏడాదికొక ఇన్చార్జి అధికారి నియమిస్తూ చేతులు దులుపుకుంటూ వస్తుంది. ఇలా చేయడం వల్ల జాతర సమయంలో అటు అధికారులు, ఇటు ప్రజలు కొంత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈసారి ట్రస్ట్‌ బోర్డు లేకపోవడంతో అనుభవం ఉన్న అధికారితో జాతర నిర్వహిస్తే బాగుంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.

➡️