సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

పాదయాత్రలో మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని, కనీస వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మున్సిపల్‌ కార్మికులు రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపాల్టీలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సిఐటియు, ఎఐటియుసి జెఎసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రారు మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తానని, సిపిఎస్‌ రద్దు చేస్తానని, కనీస వేతనాలు అమలు చేస్తానని ఇచ్చిన వాగ్దానాలు నేటికీ అమలు కాలేదని విమర్శించారు. సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల బెదిరించే పద్ధతి మంచిది కాదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి సరైంది కాదన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపజేయాలని, లేనిపక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు, ఎఐటియుసి నాయకులు బి.వాసుదేవరావు, బంగారు పెద్దిరాజు మాట్లాడారు. సమ్మెలో సిఐటియు నాయకులు నీలాపు రాజు, బంగారు వరలక్ష్మి, ఎం.అప్పన్న, నిమ్మకాయల ధనలక్ష్మి, బంగారు దుర్గాప్రసాద్‌, ఎస్‌కె.నాగూర్‌, ధనాల చినపెద్దిరాజు పాల్గొన్నారు.తణుకురూరల్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె ఆగదని సిఐటియు జిల్లా కార్యదర్శి పి.ప్రతాప్‌ అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టారు. మున్సిపల్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు కామన మునిస్వామి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. పర్మినెంట్‌ చేసేంతవరకూ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు అర్జి కృష్ణబాబు, కార్యదర్శి ఎన్‌.ఆదినారాయణ బాబు, మందులయ్య, కె.అయ్యప్ప, సుధాకర్‌, జ్యోతిబాబు, రమేష్‌, అనంతలక్ష్మి, సుమ, మంగ, శ్రీను పాల్గొన్నారు.తాడేపల్లిగూడెం : మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలో మున్సిపల్‌ కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులు పనిముట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.సతీష్‌. తెనాలి రాజు, ఎర్రంశెట్టి రాజు, నీలాపు ధనరాజు, అల్లం పూర్ణిమ, అల్లం శ్యామ్‌ పాల్గొన్నారు.ఆకివీడు : హామీ ఇచ్చి నాలుగేళ్లయినా మున్సిపల్‌ కార్మికులను పట్టించుకోలేదని సిఐటియు నాయకులు తవిటి నాయుడు విమర్శించారు. ఈ మేరకు స్థానిక నగర పంచాయతీ కమిషనర్‌ కృష్ణమోహన్‌కు కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం కార్మికులు పాత బస్టాండ్‌ సెంటర్లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సమ్మె చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు పి.అప్పారావు, అల్లాడి లక్ష్మీనారాయణమూర్తి, ఈశ్వరరావు, బంగారు మరియమ్మ, ఎస్‌.శ్రీను, రమేష్‌బాబు పాల్గొన్నారు.

➡️