సదస్సు జయప్రదానికి ప్రచారం

Feb 1,2024 21:33

 ప్రజాశక్తి- శృంగవరపుకోట/వేపాడ  : గంట్యాడ మండలంలోని తాటిపూడిలో శుక్రవారం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి (పోలవరం ఎడమ కాలువ) భూ నిర్వాసిత పోరాట కమిటీ (ఎపి రైతు సంఘం) ఆధ్వర్యాన నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని పలు గ్రామాల్లో రైతు సంఘం నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు.వేపాడ మండలంలోని ఆతవ, వీరనారాయణం, వికెఆర్‌ పురం ఎస్‌.కోట మండలంలోని శివరామరాజుపేటలో గ్రామాల్లో పోరాట కమిటీ కన్వీనర్‌ చల్లా జగన్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్దరాజు రాంబాబు, సహాయ కార్యదర్శి మద్దిల రమణ ప్రచారం చేపట్టారు. రైతులను కలిసి సదస్సుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కొత్తవలస మండలం నుండి గుర్ల మండలం గడిగెడ్డ వరకు సుజల స్రవంతి కాలువ నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్నారని, కెనాల్‌ అలైన్మెంట్‌ ను రైతులకు తక్కువ నష్టం ఉండేలా మార్పు చేయాలని, 2013 చట్ట ప్రకారం భూ సేకరణ చేయాలని రెండు ప్రధానమైన డిమాండ్లను రైతులు పెట్టినప్పటికీ ప్రభుత్వం గ్రామ సభలలో మెజారిటీ అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకోలేదని చెప్పారు. అప్పటి నుండి బాధిత రైతులతో పోరాటాలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. అందులో భాగంగా తాటిపూడి శివాలయం వద్ద ఉదయం 10గంటలకు నిర్వహించనున్న సదస్సుకు రైతులంతా తరలి రావాలని కోరారు.

➡️