సంచలన రాజకీయం చంచలం

సంచలన రాజకీయం చంచలంనేటి రాజకీయాల్లో ఎన్నికల తరుణంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు సర్వసాధారణమైనావి. అలాంటి తరుణంలో మార్పులు, చేర్పులతో సంచలన రాజకీయాలు

నేటి రాజకీయాల్లో ఎన్నికల తరుణంలో వ్యూహాలు ప్రతి వ్యూహాలు సర్వసాధారణమైనావి. అలాంటి తరుణంలో మార్పులు, చేర్పులతో సంచలన రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అదే సమయంలో అవి చంలనమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనే జిల్లా రాజకీయాలను చూడాల్సి ఉంది. అధికార పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జీల పేరుతో దశల వారీ ప్రకటిస్తుంది. నాలుగో విడత జాబితాలో జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను, పార్లమెంట్‌ అభ్యర్థిని ప్రకటించింది. ఇవే ఖరారన్న పరిస్థితి నెలకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. అందరూ అనుకున్నట్టుగానే ఇచ్ఛాపురం అభ్యర్థిగా పిరియా విజయ పేరును ప్రకటించడం చూశాం. ఆ నియోజకవర్గంలో రెడ్డిక సామాజికవర్గం మద్దతును కూడగట్టేందుకు జెడ్‌పి చైర్‌పర్సన్‌ అభ్యర్థిని ప్రకటించడం చూశాం. దీంతో ఆ సామాజికవర్గంలో ముసలం ప్రారంభమైనట్టు తెలిసింది. జెడ్‌పి చైర్‌పర్సన్‌గా నారాయణమ్మ పేరును ప్రకటించడంతో టిక్కెట్‌ కోసం ఎదురు చూసిన వారు తీవ్ర నిరసకు గురైనట్టు తెలిసింది. టిక్కెట్‌ ఆశతో ఎదురు చూస్తున్న పి.రాజ్యలక్ష్మికి ఆగ్రహం కలిగించినట్లు తెలిసింది. ఆశ పడేవారు, నిరాశపడడం సహజం. కానీ, తనపై తప్పుడు రిపోర్టులను అధినేత ముందుకు తీసుకెళ్లి టిక్కెట్‌ రాకుండా చేశారని రాజ్యలక్ష్మి భావిస్తున్నట్లు తెలిసింది. ఆ తప్పుడు రిపోర్టులు తన వద్దకు చేరాయని, అధినేత ముందు వాటిపై తేల్చుకోవాలని సమాయత్తమవుతున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే అభ్యర్థిని మద్దతుగా నిలుస్తారన్న సామాజిక తరగతిలోనే ఇప్పుడు చీలికవచ్చిందని, మన్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉందని భావిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గం అభ్యర్థి ఎంపికలో రకరకాల చర్చలు, ప్రతిపాదనలు వచ్చినా చివరికి భూమి గుండ్రంగా ఉందన్న చందమైంది. మాట తప్ప మడవతిప్ప తిరిగి దువ్వాడ శ్రీనివాస్‌నే ప్రకటించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఆ కుటుంబంలో రాజకీయ అంశాల్లోనూ సమన్వయం లేదని స్పష్టమైంది. ఇన్‌ఛార్జి దువ్వాడ వాణి ఉంటారని, ఆమెకే టిక్కెట్‌ వస్తుందని అధినేత చెప్పారని నేరుగా దువ్వాడ శ్రీనివాస్‌ ప్రకటించారు. శ్రీనివాస్‌ అభ్యర్థి అని బహిరంగసభలో సిఎం జగన్‌ ప్రకటించిన మాటకు మడమ తప్పినట్లయ్యింది. అంతటితో ఆ కుటుంబం రాజకీయ అంశాల్లోనూ సర్ధుకుపోవడానికి సిద్ధం కాలేదని ఆచరణలో తేలిపోయింది. టిక్కెట్‌ తనకు రాదని, తన కూతురుకు ఇవ్వాలని తల్లి వాణి అధినేత ముందు చెప్పిన విషయం పార్టీ వర్గాల ద్వారా బయటపడింది. ఈ వ్యవహారం కథ ముగిసేది కాదని, వారసులకు టిక్కెట్‌ ఇస్తే ఇక దానికి అంతముండదని అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. ఈ జిల్లాలోనే ముగ్గురు నేతలు తమ వారసులకు టిక్కెట్‌ ఇవ్వాలని కోరడం అందరికీ తెలిసిన విషయమే. ఈ దాగుడుమూత వ్యవహారం చూసిన తరువాత తిరిగి దువ్వాడ శ్రీనివాస్‌కే టిక్కెట్‌ ప్రకటించడంలో చూపిన రాజకీయ చతురత ఎలాంటి ఫలితాలు వస్తుందో చూడాల్సి ఉంది. అదే సమయంలో పార్లీమెంట్‌ అభ్యర్థిగా పేరాడ తిలక్‌ను ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే టిక్కెట్‌ రేసులో ఉన్న ఆయనకు పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించడం పలువురు సీనియర్లు అవాక్‌ అయ్యారని తెలిసింది. గత ఎన్నికల్లో ఓటమికి గురైన ఇద్దరూ కుడి, ఎడమగా చేర్చి టిక్కెట్‌ ఇవ్వడం చర్చనీయాంశమైంది. వారిద్దరూ ఇప్పుడు కలసి తిరగడం ప్రారంభంచడం చూస్తున్నాం. ఈసారి ప్రకటించే ఇదే జాబితాలో జిల్లాకు సంబంధించిన మరికొన్ని నియోజకవర్గాలు ఉన్నట్టు తెలిసింది. నరసన్నపేట నియోజకవర్గంలో వైసిపికి ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. సారవకోట మండలంలోని మాజీ మంత్రి, కృష్ణదాస్‌ కుటుంబానికి సంబంధించిన నేత ఒకరు జనసేన వైపు ఎదురు చూస్తున్నట్లు ఆ నియోజకవర్గంలో ప్రచారం మొదలైంది. వారిద్దరి మధ్య ఇటీవల కాలంలో మరింత దూరం పెరిగిందని, సారవకోట మండల పార్టీ కార్యక్రమం ఏర్పాటు విషయంలో గాని, ఆ మండలంలో చేపట్టిన కార్యక్రమాల్లోనూ అక్కడి నేతకు దూరంగా ఉంచడంతోనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన గోడదూకకుండా నిలువరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో ఏమైనా మార్పులు ఉండవచ్చు తప్ప మిగతా నియోజకవర్గాల్లో యథాతథంగా ఉంటాయని ఆ పార్టీలో ప్రచారం ఉంది. టిడిపి, జనసేన పొత్తు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కే పరిస్థితి కనిపిస్తుంది. సామాజికవర్గం దృష్టితో ఎచ్చెర్ల గాని, పాతపట్నంలో గాని జనసేనకు కేటాయించే పరిస్థితి ఉంది. అదే విషయంలో ఉభయ గోదావరి జిల్లాలో తక్కువ సీట్లు కేటాయిస్తే ఈ జిల్లా వరకు జనసేన రకపోవచ్చునన్న చర్చ పార్టీలో ఉంది. నరసన్నపేట నియోజకవర్గంలో టిడిపి కొత్త రాజకీయాలకు తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలిసింది. బగ్గు రమణమూర్తికి దాదాపు టిక్కెట్‌ ఖరైన సమయంలో ఎప్పటి నుంచో టిక్కెట్‌ కోసం ఆశతో ఎదురుచూస్తున్న డాక్టర్‌కు కొత్త అంటుకట్టి ఆశలను చిగురింపచేసే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో టిడిపి అధినేత ఉన్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. విజయనగరం ఎంపీగా వెళ్లాలని కళావెంకటరావును అధినేత చంద్రబాబు కోరినట్లు తెలిసింది. కానీ, ఆయన శాసనసభ బరిలో నిలుస్తానని చెప్పినట్లు తెలిసింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రెండు పార్టీల్లోనూ గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. పాతపట్నం నియోజకవర్గంలోనూ రెండు పార్టీల్లోనూ గ్రూపులు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. ఏదేమైనా అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రకటించిన తరువాత కచ్చితంగా గోడదూకడాలు ఉంటాయని, అయితే ఏ స్థాయిలో ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమని సీనియర్‌ రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 25న భీమిలిలో జరగనున్న ఉత్తరాంధ్ర సభ తరువాత అధికార పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. – సత్తారు భాస్కరరావు

➡️