షరతులు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

Dec 30,2023 18:10
నూతన సంవత్సర

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, అయితే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కొన్ని షరతులను విధిస్తున్నట్లు జిల్లా ఎస్‌పి పి.జగదీష్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ముందుగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 31వ తేదీ రాత్రి ప్రతీ సెంటర్లోనూ పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు లౌడ్‌ స్పీకర్లు/మ్యూజిక్‌ సిస్టంలు ఉపయోగించదలిస్తే ముందుగా పోలీసుల నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. ఈ వేడుకల్లో అశ్లీల నృత్యాలకు అవకాశం ఉండకూడదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిడం, మద్యం సేవించి వాహనాలను నడపడం వంటివి చేయరాదన్నారు. ఆకతాయిలు, మితిమీరి ప్రవర్తించే యువతను, రోడ్లుపై చిందులు తొక్కే మందుబాబులును ఇష్టానుసారంగా వాహనాలను నడిపేవారిని చిత్రీకరించేందుకు వీడియో కెమేరాలు మరియు డిజిటల్‌ కెమేరాలు ఉపయోగించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. అన్ని ప్రార్ధన మందిరాల వద్ద పోలీసు నిఘా, గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, నిర్ణీత సమయంలో ప్రార్ధనలు ముగుంచుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, జంక్షన్‌లలో కేకులు కట్‌ చేయడము నిషేధమన్నారు. ఏ వ్యక్తి అయినా హద్దు మీరి ప్రవర్తించిన, నిబంధనలు పాటించకపోయినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్‌పి జగదీష్‌ హెచ్చరించారు.

➡️