శ్రామిక జెండా తొలగించిన వారిపై కఠినచర్యలు

శ్రీకృష్ణ భవన నిర్మాణ కార్మికులు

37వ సచివాలయ ప్లానింగ్‌ సిబ్బంది నిర్వాకంపై సిఐటియు ధ్వజం

తక్షణమే బేషరతుగా పునరుద్ధరించాలన ధర్నా, రాస్తారోకో

ప్రజాశక్తి- పిఎం.పాలెం : జివిఎంసి ఐదోవార్డు సాయిరామ్‌ కాలనీ, కొమ్మాది బస్‌స్టాప్‌ వెనుక ఎస్‌టిబిఎల్‌ థియేటర్‌ సమీపంలో శ్రీకృష్ణ భవన నిర్మాణ కార్మికులు ఏర్పాటుచేసిన సిఐటియు జెండా, సంఘం బోర్డు తొలగింపును నిరసిస్తూ శుక్రవారం సిఐటియు మధురవాడ జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో సంబంధిత సచివాలయం వద్ధ బైఠాయించి, ధర్నా నిర్వహించారు. శ్రామికుల జెండాను, బోర్డును తొలగించిన సచివాలయ ప్లానింగ్‌ సిబ్బంది, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సచివాలయ ప్రణాళికా సిబ్బంది తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జోన్‌ ప్రదాన కార్యదర్శి పి.రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ మధురవాడ ప్రాంత సాయిరాం కాలనీ, మరికొన్ని కాలనీల్లోని భóవన నిర్మాణ కార్మికులంతా సిఐటియుకు అనుబంధంగా శ్రీకృష్ణ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. సాయిరాం కాలనీలో చెత్తాచెదారం, దుర్గంధం నిండిన ప్రాంతాన్ని శుభ్రపరిచి, సిఐటియు జెండాను, సంఘం బోర్డును ఏర్పాటు చేస్తే, కనీసం సమాచారమివ్వకుండా వాటిని తొలగించడమే కాకుండా, జెండా స్తంభాన్ని విరగ్గొట్టడం దుర్మార్గమన్నారు. 37వ సచివాలయ పరిధిలో ఎక్కడికక్కడే వందలాదిగా రాజకీయ పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు ఉంటే వాటి జోలికిపోని సచివాలయ సిబ్బంది, సిఐటియు జెండా, బోర్డును తొలగించడం కార్మికుల పట్ల చిన్నచూపు, నిర్లక్ష్యానికి నిదర్శనమేనన్నారు. బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టడంతోపాటు, తొలగించిన జెండా, బోర్డులను తీసేసిన వారితోనే పునరుద్ధరించే చర్యలు చేపట్టకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎ.లక్ష్మణరావు, సిఐటియు నేతలు, కార్యకర్తలు జి. చిన్నారావు, జి.కిరణ్‌, పి లక్ష్మణరావు, ఎ.సత్తిబాబు, కె.రమణ, ఎం కంచయ్య, ఎ.నారాయణరావు, డి.అప్పలరాజు పాల్గొన్నారు.

సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న సిఐటియు నేతలు, భవన నిర్మాణ కార్మికులు

➡️