శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Jan 11,2024 23:17
అసెంబ్లీ స్థాయి మాస్టర్‌

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌

అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనర్లకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సూచించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం జిల్లా స్థాయి శిక్షకులతో నియోజకవర్గ స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నియోజక వర్గ స్థాయిలో నాలుగు ప్రధాన బృందాలతో రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్‌ ట్రైనర్‌ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. జిల్లా పరిధిలో జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనీగా పోలింగ్‌ సంబంధ అంశాలు, ఎంసిసి, ఐటి అప్లికేషన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ అంశాలపై ఇద్దరిద్దరు చొప్పున నియమించామని తెలిపారు. వారు నియోజకవర్గ స్థాయిలో నియమించే ఆయా బృందాలకు సమగ్ర శిక్షణ ఇచ్చి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి తమ వంతు బాధ్యత నిర్వర్తించాల్సి ఉందన్నారు. మొత్తం 7 నియోజక వర్గాలకు 75 మందిని నియమించడం జరిగిందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తేదీని అనుసరించి ఏ ఏ బృందాలకు ఎప్పుడు ఏ తేదీల్లో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు శిక్షణ ఇవ్వాలో ఆమేరకు సంసిద్ధంగా ఉండాలని, ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. శిక్షణ కోసం షెడ్యూల్‌ తయారీలో శిక్షణ ఇవ్వబడే సబ్జెక్టుల వారీగా పాల్గొనేవారి ఉద్యోగుల సంఖ్యపై అంచనా వేయాలని, నిర్ధిష్ట సంఖ్యలో వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. శిక్షణ షెడ్యూల్‌ను ఖరారు చేసే ముందు మాస్టర్‌ ట్రైనర్‌లు/రిసోర్స్‌ పర్సన్‌ల లభ్యతను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శిక్షణ షెడ్యూల్‌ను ప్రకటనకు ముందస్తుగా శిక్షణ కోసం స్థలం గుర్తింపు, ట్రైనింగ్‌ మెటీరియల్‌ అందరికీ పంపిణీ చేయాల్సి ఉంటుందని అన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి శిక్షణ పొందిన తహశీల్దార్లు, ఎంపిడిఒలు ఆయా సబ్జెక్ట్‌లలో ఎన్నికల మార్గదర్శకాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవత్సవ్‌, సహాయ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌, డిఆర్‌ఒ జి. నరసింహులు పాల్గొన్నారు.

➡️