వైసిపిలో అంతర్గత పోరు

వైసిపిలో అంతర్గత పోరు

ప్రజాశక్తి-అమలాపురం అమలాపురం వైసిపిలో అంతర్గత పోరు ఎక్కడికి దారి తీస్తుందోనని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి విజయం కోసం కృషి చేసిన కీలకమైన నాయకుడు ఒక సామాజికవర్గంలో బలమైన పట్టు ఉన్న వాసంశెట్టి సుభాష్‌ తాజాగా పార్టీని వీడడం రాజకీయాల్లో కాక రేపింది. అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నాయకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌తో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వారితో తాజాగా సుభాష్‌ పార్టీని వీడుతున్నట్టు బుధవారం ప్రకటించారు. నియోజకవర్గంలో తమ సామాజిక వర్గంలో అధిక సంఖ్యలో ప్రభావితం చేసే ఓటు బ్యాంకు కలిగి ఉన్న సుభాష్‌కు వచ్చిన ఎంఎల్‌సి పదవి అవకాశాన్ని మంత్రి విశ్వరూప్‌ అడ్డుకున్నారని ఊహాగానాలు రేగాయి. దీంతో మంత్రి విశ్వరూప్‌తో విభేదాల కారణంగా సుభాష్‌ పార్టీలో ఉన్నా మంత్రి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరో బలమైన నాయకుడు కుంచే రమణారావు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరికీ సుపరిచితులయ్యారు. నియోజకవర్గ ప్రజల్లోనూ క్రైస్తవ సమాజంలో, దళిత సామాజిక వర్గంలోనూ బలమైన పట్టు కలిగి ఆర్థికంగా కూడా బలమైన స్థితిలో ఉన్నారు. ఆయన కూడా మంత్రి విశ్వరూప్‌తో విభేదాలు ఉన్నప్పటికీ పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు. అమలాపురం అల్లర్ల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సుభాష్‌ ఒక్కసారిగా టిడిపి వైపు అడుగులు వేయడం సంచలనం రేపింది. బలమైన పట్టు ఉన్న నాయకుడు సుభాష్‌ను పార్టీ వదులుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని వైపిపి నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మంత్రి విశ్వరూప్‌తో కలిసి పార్టీ కోసం పని చేయలేకనే సుభాష్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని నియోజకవర్గంలోని ప్రజలు భావిస్తున్నారు. రమణారావు రాజకీయ భవిష్యత్తుపై కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మంత్రి విశ్వరూప్‌తో విభేదాల కారణంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూనే పార్టీలోనే కొనసాగుతున్నారు. రమణారావు గుడ్‌ సీడ్‌ ఫౌండేషన్‌ ద్వారా పేద ప్రజలకు ఎవరికి సాయం కావాల్సి వచ్చినా ముందు వరసలో ఉండి వ్యక్తిగతంగా సాయం అందిస్తూ అందరికీ సుపరిచితులయ్యారు. ఏ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినా సిఎం వైఎస్‌.జగన్‌ రాష్ట్రాభివృద్ధికి, పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నానని చెబుతున్నారు. మారుతున్న తాజా రాజకీయ పరిణామాలతో రమణారావు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సుభాష్‌ టిడిపి వైపు వెళితే రమణారావు కూడా టిడిపి, జనసేన పార్టీలవైపు మొగ్గు చూపుతారా లేక షర్మిల రాకతో కాంగ్రెస్‌ పార్టీలో చేరతారా లేకుంటే వైసిపిపై ఉన్న మక్కువతో ఆ పార్టీలోనే కొనసాగుతారా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఈ పరిణామాలు మంత్రి విశ్వరూప్‌నకు ఇబ్బందికరంగానే ఉన్నాయి.

వైసిపికి వాసంశెట్టి సుభాష్‌ రాజీనామా

వైసిపి యువ నాయకుడు వాసంశెట్టి సుభాష్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం శ్రీరామ్‌పురంలోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ నాయకత్వం తమ కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసిందని ఆయన చెప్పారు. తన తల్లిని మున్సిపల్‌ చైర్మన్‌ చేస్తామని ఆర్థికంగా ఖర్చు చేయించి చివరి నిముషంలో అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అధిష్టానం మంచి పదవి ఇస్తానంటే ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌తో పాటు మంత్రి విశ్వరూప్‌ అడ్డుకున్నారని చెప్పారు. కేసులు ఎత్తివేయడంలో పూర్తిగా సహకరించిన మిథున్‌ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. స్థానికేతరులకు టిక్కెట్‌ ఇవ్వవద్దని చెప్పినా అధిష్టానం వినలేదన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తనతోపాటు కామన గరువు ఎంపిటిసి గుత్తుల ప్రసాద్‌, మొగళ్లమూరు సర్పంచ్‌ రాయుడు విష్ణు రాజీనామా చేశారని, తన అనుయాయులతో ఆలోచించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని సుభాష్‌ తెలిపారు.

➡️