వైద్య ఆరోగ్యశాఖలో జీరో వెకెన్సీ విధానం

Jan 8,2024 08:08 #speech, #vidudala rajini

– వైద్యుల సదస్సులో మంత్రి విడదల రజనీ

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:వైద్య ఆరోగ్యశాఖలో జీరో వెకెన్సీ విధానంతో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ వైదులతో ఆదివారం ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యులకు ఉద్యోన్నతులు ఇచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని అన్నారు. వైద్యుల వేతనాలను కూడా గణనీయంగా పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతులు ఇవ్వడం, వైద్యుల రక్షణ కోసం చట్టాలు తీసుకురావడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అడిషనల్‌ డిఎంఇ ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా జీరో వేకెన్సీ విధానంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. 53 వేల పోస్టులు భర్తీ చేసి జగన్‌ రికార్డు సఅష్టించారన్నారు. రోగులు, ప్రజల అవసరాలను బట్టి కొత్తగా నెఫ్రాలజీ వార్డులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ట్రైబల్‌ ప్రాంతాల్లో నియామకాలు చేపట్టి అక్కడి ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్యసేవలు పొందేలా చేశామన్నారు. వ్యాధుల బారినపడకుండా ప్రజలకు ప్రివెంటివ్‌ మెడికల్‌ కేర్‌ ఏర్పాటు చేశామని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్‌, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాల ద్వారా పేదల ఇళ్లకే వైద్యులు వెళ్లి ఉచితంగా వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు.

➡️