వేధింపులు ఆపాలని పిఆర్‌ ఇంజినీరింగ్‌ అధికారుల నిరసన

Feb 23,2024 21:32

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఇంజనీరింగ్‌ అధికారులపై వేధింపులు ఆపాలని జిల్లా పంచాయితీ రాజ్‌ ఇంజనీర్ల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంఘం నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పిఆర్‌ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు లక్ష్మణరావు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కావడం లేదన్నారు. గతంలో జరిగిన ఉపాధి హామీ ఎస్‌డిఎఫ్‌ ఇతర గ్రాండ్లతో జరిగిన పనులపై విజిలెన్స్‌ ఎన్ఫోర్స్మెంట్‌ కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అప్పటి పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట ఇచ్చినప్పటికీ ఎంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీర్ల వాహనాల అద్దె, మూడు శాతం అడ్మినిస్ట్రేషన్‌ చార్జీలు, ఔట్సోర్‌ సిబ్బందికి జీతాలు గత ఏడాది నుంచి లేక ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని అన్నారు. డిపార్ట్మెంట్‌లోని అన్ని సెక్షన్‌ ఆఫీసర్‌ ఖాళీలు, ఎఇ, ఎఇఇ, జెటిఒలో నియామకం జరపకపోవడంతో అధికారులకు పని భారం పెరిగిపోతుందన్నారు. ఉపాధి హామీ పనులతో పాటు ప్రాధాన్యతా భవనాల పనుల బిల్లులు తక్షణమే చెల్లించాలని, కొత్త జిల్లాలకు కొత్త నియామకాలు జరపాలని, పిఆర్‌ సిబ్బంది, అధికారులపై దురుసు ప్రవర్తన వేధింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 27 లోగా పై సమస్యలు పరిష్కరించకపోతే 28న మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

➡️