వృత్తి నైపుణ్యం అవసరం

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

  • ఎస్‌పి జి.ఆర్‌ రాధిక

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీస్‌ సిబ్బందికి సూచించారు. స్థానిక ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు మైదానంలో జిల్లా సాయుధ పోలీసు బలగాలకు 15 రోజుల పాటు నిర్వహించే మొబిలైజేషన్‌ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్ట పరిధిలో వస్తున్న మార్పులు, శాంతిభద్రతల్లో కొత్తగా తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రానున్న రోజుల్లో విధుల్లో ఎదుర్కోబోయే అవరోధాలను అధిగమించే విధంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ఫైరింగ్‌, డ్రిల్‌, కవాతు, మాబ్‌ కంట్రోల్‌, ప్రముఖుల బందోబస్తు తదితర విధులలో మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశానిర్దేశం చేశారు. కొత్త విషయాలు తెలుసుకొని నూతన ఉత్తేజంతో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఎఆర్‌ సిబ్బందికి ఏటా మొబిలైజేషన్‌ కార్యక్రమం ఒక రీఫ్రెష్‌మెంట్‌ కోర్సు వంటిదన్నారు. రోజువారీ విధుల్లో నైపుణ్యం, శారీరక దారుఢ్యం మెరుగుపరచడం అవసరమని చెప్పారు. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఆర్‌ సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించాలన్నారు. సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా, ధ్యానం గురించి ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. ఉన్న సమయంలో ఉద్యోగంతో పాటు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌పి జె.తిప్పేస్వామి, ఎఆర్‌ డిఎస్‌పి కె.ఎస్‌ నివాసన్‌, ఆర్‌ఐలు డి.సురేష్‌, ఉమామహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

 

 

➡️