విశ్రాంతి కోరడం వివక్షకు ఎలా దారి తీస్తుంది ?

Dec 25,2023 11:40 #feature

నరాలు తెగిపోతున్న బాధను పంటిబిగువున బిగబట్టి, అణువణువు కంపించిపోతున్న వేదనను అనుభవించి అమ్మ బిడ్డకు జన్మనిస్తుంది. రక్తమాంసాలను క్షీరధారలుగా చేసి బిడ్డ ఆకలి తీరుస్తుంది. ఈ రెండు సందర్భాల గురించి తలచుకున్నప్పుడల్లా మహిళలపట్ల ఎంతో గౌరవం, మరెంతో ఉదారత కనబరుస్తుంది సమాజం. అదే మహిళ రుతుక్రమంలో ఉందంటే మాత్రం ఆమె పట్ల చిన్నచూపు ప్రవర్తిస్తుంది. ఆ బాధను చెప్పుకుంటే ఆమెను తక్కువ చేసి మాట్లాడుతుంది. సరిగ్గా ఇప్పుడు అలాగే జరిగింది. పెద్దల సభ సాక్షిగా ఆమెకు అవమానం జరిగింది. రుతుక్రమంలో ఉన్న మహిళకు విశ్రాంతి ఇవ్వడం వైకల్యంతో ముడిపెట్టారు. సమానత్వ సాధనలో ఉన్న మహిళ పట్ల ఇది వివక్షకు దారితీస్తుందని సుద్దులు చెప్పారు. ఇంత హేళన ఎందుకు ?

           రుతుక్రమంలో విశ్రాంతి కోరితే ఆమెను శక్తిహీనురాలిలా చూడాలా ? రుతుక్రమంలో ఉన్నప్పుడే.. ఆమె కొండలను పిండి చేసే శక్తిని ప్రదర్శిస్తోంది. పర్వత శిఖరాలు అధిరోహిస్తోంది. క్రీడామైదానాల్లో పరుగులు తీస్తోంది. పతకాలు సాధిస్తోంది. వంటగదిలో విరామం లేకుండా శ్రమిస్తోంది. ఆఫీసులో విసుగులేకుండా పనిచేస్తోంది. ప్రసవ వేదనను ఎంతలా అనుభవిస్తుందో రుతుక్రమంలో కూడా ఆమెకు అదే బాధ, అదే వేదన. కత్తితో పొడిచి మెలిపెట్టి తిప్పినంత కష్టం. కంటివెంట కన్నీళ్లు రావుగాని, ఆ క్షణం ఒళ్లంతా నీరైన నిస్సత్తువ ఆవహిస్తుంది. ఇంతటి బాధలో కూడా చిరునవ్వులు చిందిస్తూ తన వల్ల ఏ అసౌకర్యం రాకుండా జాగ్రత్త పడుతుంది. ‘ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటే ఎంతో బాగుంటుంది. కానీ ఆ అవకాశం లేద’ని వాపోయేవారెందరో.. ఉన్నత విద్యావంతులు, ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డవారు, శ్రామిక మహిళ, కార్మిక స్త్రీ ఇలా ఏ రంగంలో పనిచేస్తున్నా ఆ రోజుల్లో కాస్తంత విశ్రాంతి కోరుకుంటుంది ఆమె.

సమాజంలో మార్పు రావాలి

‘విశ్రాంతి గురించి ఆలోచించే ముందు, రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలు తొలగిపోవాలి. సమాజంలో ఆ దిశగా మార్పు రావాల’ని న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌, రచయిత సమీనా దల్వాయి, తనకెదురైన అనుభవాలను ఇలా వివరించారు. ‘నేను షాపుకెళ్లి శానిటరీ ప్యాడ్లను అడిగినప్పుడు, షాపు యజమాని ఓ న్యూస్‌పేపరులో చుట్టి, నల్ల కవరులో పెట్టి ఇస్తాడు. ఒకసారి అలా వద్దని నేరుగా తీసుకుంటే చాలా ఇబ్బందిగా ముఖం పెట్టి ఇచ్చాడు. అది తీసుకుని బజారులో నడుస్తున్నప్పుడు, నా చేతిలో ఉన్న ఇతర మందుల కవర్లు, బాత్‌రూమ్‌ క్లీనర్లు ఎన్ని ఉన్నా అందరిచూపు ఆ శానిటరీ ప్యాడ్‌ మీదే ఉంది. వారంతా చాలా అసౌకర్యంగా ఉండడం నాకు తెలుస్తోంది’ అంటూ చెప్పారు. ఈ అనుభవం సమీనాది మాత్రమే కాదు.. ఎందరిదో..

మార్పు రావాలి

ఈ తరంలోనైనా కాస్త మార్పు తేవాలని నా వంతు ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పుడు నా విద్యార్థులు, తమ స్నేహితులను బహిరంగంగా శానిటరీ ప్యాడ్లు అడుగుతారు. అప్పుడు, ఆ బృందంలో ఉన్న మగ విద్యార్థులెవరూ తమ కనుబొమ్మలెగరేయరు. పైగా రుతుక్రమంలో ఉన్న వారికి అవసరమైన వస్తువులు తెచ్చిపెడతారు. తమ స్నేహితుల ఇబ్బందులను అర్థం చేసుకుని పెయిన్‌కిల్లర్‌ టాబ్లెట్లు, ఉపశమనం కోసం వాడే ఇతర బామ్‌లు వంటివి తెస్తుంటారు’ అని సమీనా అంటున్నారు.

విశ్రాంతి ఎందుకంటే..

రుతుక్రమం చుట్టూ ఉన్న ఈ అపోహలు మాసిపోనంతవరకు, ఆ రోజుల్లో విశ్రాంతి ఎందుకో ఎవరికీ అర్థం కాదు. ‘రుతుక్రమంలో ఉన్నప్పుడు 1, 2 రోజులే బాధ ఉంటుంది. అదీ అందరికీ ఒకలా ఉండదు. ఈ మాత్రం దానికి విశ్రాంతి ఎందుక’ని పెద్దల సభలో మహిళా మంత్రి స్మ ృతి ఇరానీ వ్యాఖ్యానించినప్పుడు ఆమెకు మద్దతుగా కొన్ని గొంతుకలు తోడయ్యాయి. అయితే ఆ 1, 2 రోజుల బాధను భరించలేక ఇటీవల అమెరికాలో ఓ విద్యార్థిని పెయిన్‌కిల్లర్‌ టాబ్లెట్లు వేసుకుని మృతి చెందింది. ఎంత బాధ ఉంటే ఆమె ఆ పనిచేసింది. ఆ బాధ ఆమె ఒక్కదానిదే కాదు. ఎంతో మందిది. 2015లో గ్లోబల్‌ జర్నల్‌ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ సర్వే ప్రకారం … భారతీయ విద్యార్థుల్లో 70.2 శాతం మంది రుతుస్రావ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా నెలలో రెండు రోజులు తరగతులకు హాజరు కావడం లేదు. వీరిలో తీవ్రమైన బాధ అనుభవించేవారు 23 శాతం మంది ఉన్నారు. వారు, 3 రోజులు ఆ బాధను భరించారు. మరో రెండు రోజులు కూడా చాలా అసౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు. ఒక్కసారి పీరియడ్‌ నొప్పి మొదలైతే, మంచం మీద నుండి కూడా లేవలేని వారు ఎంతోమంది. సరిగ్గా భోజనం చేయలేరు. అతిసారంతో బాధపడతారు. వాంతులతో ఇబ్బంది పడతారు. అలసట, వెన్నునొప్పి, నీరసం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటివన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఎక్కడో ఏ మూలో యుద్ధాలు, వరదలు, తుఫానులు, అల్లర్లు, అణుబాంబుల దాడుల్లో చనిపోతున్న వాళ్లని తలచుకుని బాధపడతాం. ఆ అభాగ్యుల పట్ల ఉదారత చూపిస్తాం. మహిళల పట్ల ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా మానవత్వ హృదయాలెన్నో కలవరపడిపోతాయి. మరి ఇక్కడెందుకు ఆ భావన చూపించలేకపోతున్నాం. విశ్రాంతి కోరడం, వివక్షకు ఎలా దారితీస్తుంది? ఇది సమానత్వమో.. సాధికారతో.. మరేదో.. ఇంకేదో.. కాదు. ఇది ఒక సున్నితమైన అంశం. భావోద్వేగభరితం. అనాదిగా అదే లోపించింది. రుతుక్రమం చుట్టూ ఎన్నో అపోహలు, మరెన్నో నిశ్శబ్ద యుద్ధాలు.. ఆ పర్యవసానమే ప్రస్తుత వ్యాఖ్యలు.

భయంతో ఉంటారు

‘రుతుక్రమంలో ఉన్నప్పుడు మరకల భయంతో చాలామంది ముదురురంగు బట్టలు ధరించడం నాకు తెలుసు. తలుపు వెనకాల నుంచొని మాట్లాడేవారి గురించి విన్నాను. ఆమెను ముట్టుకోకూడదని, ఆమె ముట్టుకుంటే ఊరగాయ పాడైపోతుందని, ఇల్లంతా అపవిత్రమౌతుందని భావించే వారెందరో ఈ సమాజంలో ఉన్నారు. ఉన్నత స్థాయిలో స్థిరపడ్డవారు, విద్యావంతులు కూడా ఇదే ధోరణిలో ఉండిపోతున్నారు. రుతుక్రమంలో ఉన్నప్పుడు ఆమె పట్ల చూపించే వివక్ష అంతాఇంతా కాదు.

ఏకపక్ష నిర్ణయం ఆమోదం కాదు

మాతృస్వామ్య వ్యవస్థలో ఆమె ఏ స్థితిలో ఉన్నా విశ్రాంతి లేకుండా పనిచేసింది. పోరాడింది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆమెకు విశ్రాంతి ఇవ్వాలన్న ఆలోచన ఫలితంగా వేతనంతో కూడిన మాతృత్వపు సెలవులు, అనారోగ్య సెలవులను ప్రభుత్వాలు, గుర్తింపు పొందిన ప్రభుత్వేతర సంస్థలు మంజూరు చేస్తున్నాయి. కానీ రుతక్రమ సెలవులపై ఆవిధమైన భావన కొరవడింది. స్మ ృతి ఇరానీ వంటి వారు విశ్రాంతి తీసుకోవడాన్ని వైకల్యంతో ముడిపెట్టడం మహిళల పట్ల పెద్ద అవమానం. మాతృత్వం సెలవులు ఇస్తున్నప్పుడు దాన్ని అంగవైకల్యంగా ఎవరూ భావించరు. జాతి వృద్ధికి ఆమె మూలకారణమని ఎంతో గౌరవిస్తారు. సమాజానికి అదొక అవసరమైన ప్రక్రియగా అనుకుంటారు. అదేవిధంగా పీరియడ్‌లో ఉన్న వారిపట్ల కూడా ఆలోచించాలి. అదొక సహజ ప్రక్రియగా భావించాలి. రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలు తొలగిపోయి, శాస్త్రీయ ఆలోచనలు రావాలి. ఈ అంశంపై మహిళలతో, వైద్యులతో చర్చలు జరపాలి. ఏకపక్షంగా తిరస్కరించడం ఆమోదం కాదు. మహిళలను గౌరవిస్తాం అని చెబుతూనే వాళ్లకు సంబంధించిన ఏ చిన్న అంశంలోనైనా వాళ్లని ఘోరంగా అవమానించడం, అగౌరపర్చడం ఈ పాలకులకు అలవాటైన పద్ధతి. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సముచిత నిర్ణయం వైపు అడుగులు వేయాలి.

– డి.రమాదేవి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

➡️