విశాఖ ఉక్కు జోలికొస్తే సహించం

Feb 2,2024 08:10 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జోలికొస్తే సహించబోమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలోని కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 1085వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ కన్‌స్ట్రక్షన్‌, ట్రాఫిక్‌, ఆర్‌ఎండి విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా డి.ఆదినారాయణ మాట్లాడుతూ..ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు కట్టబెట్టడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిందని విమర్శించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో సమర్థించుకోవడం దారుణమన్నారు. విశాఖ ఉక్కుపై కన్ను పడినందుకే అదానీ పతనం ప్రారంభమైందన్నారు. ఈ దేశంలో మోడీకి అండగా నిలిచిన రాజకీయ పార్టీలు అధోగతి పాలుకాక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగా ఉత్పత్తిని తగ్గించి, కొన్ని విభాగాలను మూసివేసి నష్టాల వైపు నడుపుతున్నారని ఆరోపించారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీస్తూ, ప్రమోషన్లు కల్పించకుండా అనేక అవరోధాలు కల్పిస్తూ పారిశ్రామిక అనిశ్చితికి కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. దీక్షా శిబిరంలో నాయకులు డి.హరినాథ్‌, ఎస్‌.ఈశ్వరరావు, పి.అప్పారావు ఆర్‌.శ్రీనివాసరావు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️