విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం

కుటుంబ సభ్యును పరామర్శిస్తున్న శంకరరావు

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో జోగంపేట ఎస్సీ వసతి గృహంలో చదువుతూ ప్రమాదవశాత్తు మరణించిన తూబిరి డేవిడ్‌ రాజు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎస్టీ కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ జివి.శంకరరావు తెలిపారు. మండలంలో జోగంపేట ఎస్సీ వసతి గృహంలో ఏడవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థి డేవిడ్‌రాజు విద్యుత్‌ షాక్‌ గురై మృతి చెందడంతో గురువారం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు.ముందుగా జోగంపేటలో విద్యార్థి మృతి చెందిన ఎస్సీ వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వసతి గృహాన్ని పక్కనే ఉన్న మరో భవనంలోనికి మార్పు చేయడం జరిగిందని అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం విద్యార్థి గ్రామమైన పాత మల్లంపేట శివారు బుడ్డడుపాడు గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, కుమారుడిని కోల్పోయిన డేవిడ్‌ రాజ్‌ తల్లిదండ్రులకు ప్రభుత్వం అండదండలు అందిస్తుందన్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి మెరుగైన జీవనోపాధిని అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారాన్ని అందించడానికి ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. అనంతరం గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూములకు పట్టాలు ఇవ్వాలని వేడుకున్నారు. అనంతరం కృష్ణదేవిపేట ఉన్న అల్లూరి గంటందొర సమాధులను ఆయన సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయరాం, ఎంపిడిఒ రత్నకుమారి, డిప్యూటీ తహశీల్దార్‌ ఆనందరావు, ఎంపిపి జి.మణికుమారి, వైసిపి జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షురాలు లోచల సుజాత, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️