విజయవాడ తరలిన అంగన్వాడీలు

ప్రజాశక్తి – భీమవరం

అంగన్వాడీలు తమ గోడును జగనన్నకు చెప్పుకునేందుకు జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ఆదివారమే విజయవాడ తరలివెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ విశ్వ ప్రయత్నాలు చేశారు. దీన్ని అధిగమించి అంగన్వాడీలు విజయవాడ తరలివెళ్లినట్లు అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నేతలు తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గత 40 రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ నిర్బంధాన్ని ప్రయోగించి భయపెట్టి విధుల్లోకి తీసుకొచ్చేందుకు ఎస్మాను సైతం ప్రయోగించింది. ఇవన్నీ ఎదురొడ్డి పోరాట పటిమను ప్రదర్శిస్తున్న అంగన్వాడీలు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు చలో విజయవాడకు సన్నద్ధమయ్యారు. దీనిలో భాగంగా జిల్లా నుంచి అంగన్వాడీలు వందలాది మంది తరలివెళ్లారు. ఆర్‌టిసి బస్సులు, రైళ్లలో ముందుగానే విజయవాడ బయల్దేరి వెళ్లారు. అయితే ఆదివారం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. బస్సుల్లో సైతం తనిఖీలు చేశారు. భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం వంటి ప్రాంతాల్లో అంగన్వాడీల కోసం పోలీసులు జల్లెడపట్టారు. వీటన్నింటినీ అధిగమించి సుమారు 500 మందికిపైగా అంగన్వాడీలు విజయవాడ తరలివెళ్లారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఎంత నిర్బంధం విధించినా, అక్రమ అరెస్టులకు పాల్పడినా సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిఐటియు గణపవరం మండల అధ్యక్షులు ఎం.పెంటారావును పోలీసులు అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. అలాగే నరసాపురం రైల్వే స్టేషన్లో 22 మంది అంగన్‌వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరం రూరల్‌:జగనన్న నిన్ను గెలిపించి తప్పు చేశామని, మా సమస్యలు పరిష్కరిస్తావనుకున్నాం గానీ మమ్మల్ని రోడ్ల పాలు చేస్తావని అనుకోలేదని చెంపలను చేతులతో కొట్టుకుంటూ ఆదివారం అంగన్‌వాడీలు వినూత్న నిరసన తెలిపారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌, సిఐటియు ఆధ్వర్యంలో 41 రోజు సమ్మె కొనసాగింది. ముందుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు తెలుపుతూ యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి సిహెచ్‌ పట్టాభి రామయ్య, రాష్ట్ర కౌన్సిలర్‌ జివివి.రామాజరావు, జిల్లా కార్యదర్శులు సిహెచ్‌ కుమార్‌ బాబ్జి, బి.ఏసుబాబు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్‌, జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు వారికి కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి గోపాలన్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు రామలక్ష్మి, మాధవి, జి.దమయంతి, మల్లేశ్వరి, సిఐటియు మండల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అంగన్వాడీలు సహాయనిధిని సేకరించారు.పోడూరు : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు ఆదివారం మండలంలోని గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ లీడర్‌ పీతల రాజమణి, రాయుడు కుమారి, జె.ఉమాదేవి, పి.మంగ పాల్గొన్నారు.ఆచంట : అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లేందుకు ఎటువంటి అనుమతులు లేవంటూ ఆదివారం సాయంత్రం ఆచంట పోలీసులు సిఐటియు మండల కార్యదర్శి వర్ధిపర్తి అంజిబాబును హౌస్‌ అరెస్ట్‌ చేసి నోటీసులు జారీ చేశారు. వీరవాసరం : జారిస్టు రష్యాను సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గా మార్చిన ప్రపంచ విప్లవ నేత విఐ లెనిన్‌ శత వర్థంతి సందర్భంగా వీరవాసరంలో అంగన్వాడీలు సమ్మె శిబిరంలో ఆదివారం లెనిన్‌ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు. సమాజంలో ప్రజలందరూ సమానంగా ఉండాలని, అన్ని రకాల సదుపాయాలూ అందరికీ అందుబాటులో ఉండే విధానం అమల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు అన్నారు. లెనిన్‌ శత వర్థంతి సభలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయని, అందులో భాగంగా దేశంలో కూడా వివిధ ప్రాంతాలలో సభలు జరుగుతున్నాయని అన్నారు. సోషలిస్టు వ్యవస్థ లక్ష్యాలు, లక్షణాలను నేటి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పి.నాగరత్నం, శాంతి కుమారి, నాగపార్వతి, మంగ, దుర్గ పాల్గొన్నారు.

➡️