విచారణ అనంతరం చర్యలు

పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని

పాఠశాల ప్రిన్సిపాల్‌ సుజాతను విచారిస్తున్న ఆర్‌జెడి జ్యోతికుమారి

ఆర్‌జెడి జ్యోతికుమారి

ప్రజాశక్తి- ఆమదాలవలస

పట్టణంలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఆర్‌జెడి ఎం.జ్యోతి కుమారి తెలిపారు. సెంటెన్స్‌ పాఠశాలపై ఇటీవల వచ్చిన ఆరోపణలపై బుధవారం ఆమె జిల్లా విద్యాశాఖ అధికారి కె. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో పాఠశాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకుని తల్లిదండ్రుల ఫిర్యాదు వివరాలు, ఎంఇఒ విచారణ నివేదికలు పరిశీలించి పాఠశాల యాజమాన్య పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. 1200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒకేఒక్క ప్రిన్సిపాల్‌ బాధ్యత వహించడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రాథమిక స్థాయి, ఉన్నత స్థాయిలో ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా పర్యవేక్షిస్తే ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూడవచ్చని ప్రిన్సిపాల్‌ సుజాతకు సూచించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు భవిష్యత్‌లో ఏ ప్రైవేట్‌ పాఠశాలలో విధులు చేపట్టకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మీపైనే ఉందని, సర్వీస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేటప్పుడు కాండాక్ట్‌పై తెలియజేయాలని ఆర్‌జెడి సూచించారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం జరిగితే పాఠశాల గుర్తింపు రద్దుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం సెంటెన్స్‌ పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సెంటెన్స్‌ పాఠశాలలో నెలకొన్న సంఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ చేపట్టడం జరుగుతుందని, విచారణ నివేదిక ఆధారంగా పాఠశాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఇఒలు జి.రాజేంద్రప్రసాద్‌, టింగరాజు, సిఆర్‌పిలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️