వికలాంగుల అంశాలను మ్యానిఫెస్టోల్లో పెట్టండి

Mar 6,2024 08:13 #Include disability, #manifestos

– రాజకీయ పార్టీలకు ఎన్‌పిఆర్‌డి డిమాండ్‌

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :వికలాంగుల అంశాలను రాజకీయ పార్టీలు వారి మ్యానిఫెస్టోల్లో పెట్టాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలోని 25 లక్షల మంది వికలాంగులు కష్టాల్లో ఉన్నారని, వికలాంగుల చట్టం – 2016 అమలు కాకపోవడంతో భద్రత కరువైందని, సంక్షేమ పథకాల్లోనూ పాలకులు కోతపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నేటికీ వివక్షత కొనసాగుతోందని తెలిపింది. ఇటువంటి తరుణంలో అన్ని విధాలా ఆదరవుగా నిలిచే వారికే ఎన్నికల్లో వికలాంగుల మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం వేదిక ప్రాంతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు ఎం అడివయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల చట్టాన్ని, పథకాలను నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రస్తుతం ఇస్తున్న రూ.3000 పింఛనును రూ.6000కు పెంచాలని డిమాండ్‌ చేశారు. వికలాంగుల చట్టం – 2016ను పటిష్టంగా అమలు జరపాలని కోరారు. అర్హులందరికీ ఎటువంటి నియమ నిబంధనలూ పెట్టకుండా మోటారు వాహనాలు, ఇతర ఉపకరణాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని రకాల బస్సు సర్వీసుల్లో వికలాంగులు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని, బడ్జెట్‌లో ఐదు శాతం నిధులు కేటాయించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు మాట్లాడుతూ వికలాంగుల కార్పొరేషన్‌ ద్వారా పూర్తి సబ్సిడీతో రూ.పది లక్షల రుణం మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని కోరారు. వైసిపి హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక మొత్తాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి వికలాంగునికి/ వికలాంగురాలికి వివాహంతో సంబంధం లేకుండా అంత్యోదయ కార్డు ఇచ్చి 35 కిలోల బియ్యం పంపిణీ చేయాలని, ఇతర నిత్యావసరాలను, ఏడాదికి ఆరు గ్యాస్‌ సిలిండర్లును ఉచితంగా ఇవ్వాలని కోరారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లు, ఇళ్ల స్థలాల్లో ఐదు శాతం రిజర్వేషన్‌ను విధిగా అమలు చేయాలని, నామినేటెడ్‌ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి వికలాంగుని కుటుంబానికీ 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి తులసీదాస్‌ మాట్లాడుతూ పాలకులు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. తక్షణమే అన్ని రాజకీయ పార్టీలూ వికలాంగుల డిమాండ్లపై స్పందించి మ్యానిఫెస్టోల్లో పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెట్టాల్సిన వికలాంగుల అంశాలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు బి నూకప్పారావు, పాల వెంకయ్య, జి వెంకటరమణ, బాలకృష్ణ, శ్రీనివాస్‌, వరలక్ష్మి, వి దుర్గ తదితరులు పాల్గొన్నారు.

➡️