వర్షాలు తగ్గే వరకు వరి కోతలు వద్దు

Dec 4,2023 23:01
తుపాను

తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌
మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో రానున్న 48 గంటల పాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత సూచించారు. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మాధవీలత, ఎస్‌పి పి.జగదీష్‌, జెసి ఎన్‌.తేజ్‌భరత్‌, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. కోతలు చేపట్టకుండా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరైనా యంత్రాలు ఉపయోగించి కోతలు చేపడితే సీజ్‌ చేస్తామన్నారు. ఇప్పటికే కోతలు పూర్తి చేసిన వాటిని తక్షణమే మిల్లులకు తరలించాలన్నారు. ముంపు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు దిగువకు పోయేలా చూడాలన్నారు. అవసరమైతే మోటార్లను ఉపయోగిం చాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర మందులు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. సిబ్బందిని, వైద్య శిబిరాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ సిబ్బందిని నియమించాలన్నారు. రహదారుల నిర్వహణ పర్యవేక్షణ చేపట్టాలన్నారు. చెట్లు కూలితే వెంటనే తొలగించాలన్నారు. అగ్ని మాపక విభాగం కట్టింగ్‌ యంత్రాలను, ఫైర్‌ పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్‌, పంచాయతీ అధికారులు శానిటేషన్‌ నిర్వహణ పనులు పరిస్థితులకి అనుగుణంగా చేపట్టవలసి ఉంటుందని, ఆమేరకు సిబ్బందిని సంసిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల, వ్యవసాయ అధికారులు ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు సంబంధించి కోతలు కోసిన పంట ను కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలన్నారు. రవాణా శాఖ అధికారులు నిత్యావసర వస్తువుల రవాణా కోసం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనంతరం డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌, జెసి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ మాధవీలత

➡️