వర్షార్పణం..!

ప్రజాశక్తి – మండవల్లి

మిచౌంగ్‌ తుపాను మండలాన్ని అతలాకుతలం చేసింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లింగాల, అల్లినగరం, కానుకొల్లు, అయ్యవారి రుద్రవరం గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో మినుము పంట పూర్తిగా నీట మునిగింది. లింగాల, అల్లినగరంలోని ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. ఇంగిలి పాక లంక వద్ద చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం : మండలంలో కోతకొచ్చిన వరిచేలు నేల వాలాయి. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పేరంపేట, పంగిడిగూడెం, లక్కవరం, దేవులపల్లి తదితర ప్రాంతాల్లో వరిచేలు నేలవాలాయి. పట్టణంలో అంతర్గత రోడ్లు చెరువులను తలపించాయి. కళాశాల రోడ్డులో కాకర్ల జంక్షన్‌ వద్ద డ్రెయినేజీ పొంగి రోడ్డుపై మురుగనీరు రోడ్డుపైకి చేరడంతో అధ్వానంగా తయారైంది. ఉంగుటూరు : మండలంలోని కొత్తగూడెం, తిమ్మయ్యపాలెంలో ధాన్యం రాశుల చుట్టూ వరద నీరు మూడు అడుగుల మేర చేరింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. జీలుగుమిల్లి:మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో మండలంలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. జీలుగుమిల్లి – బర్రింకలపాడు రహదారి మధ్యలో ఉన్న అశ్వారావుపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వంకవారిగూడెం వద్ద కాలువ ఉధృతంగా రోడ్‌పై నుంచి ప్రవహించడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరి, వేరుశనగ, పొగాకు పంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముదినేపల్లి : తుపానుకు మండలం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షాలు, భీకర గాలులకు ప్రజలు భయందోళనకు గురయ్యారు. జనజీవనం పూర్తిగా స్తంభించింది. పలుచోట్ల తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల గుడిసెలు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. ముదినేపల్లి సెంటర్‌లోని సినిమా థియేటర్‌, హోటళ్లు మూతపడ్డాయి. చింతలపూడి : మండలంలో వరిపంట రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు కన్నీరుపెడుతున్నారు. ఇటీవల వరకూ వర్షాల్లేక కొన్నిచోట్ల వరి పంటలు ఎండిపోయాయి. మరికొన్ని చోట్ల ఉన్నకొద్దిపాటి నీటితో కాపాడుకుంటూ వచ్చిన పంటలు కాస్తా ప్రస్తుత వర్షానికి నాశనమయ్యాయి. ఈదుగాలులకు పలుచోట్ల మొక్కజొన్న నేలవాలింది. ఆగిరిపల్లి : మండలంలో మిచౌంగ్‌ తుపాను వర్షాలకు వరి, మినుము, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు ముంచెత్తడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ దశల్లో ఉన్న వరిపంటకు అపారనష్టం వాటిల్లింది. మినుము, పత్తికి బూజు వచ్చే ప్రమాదం ఉంది. మామిడిపూత మాడిపోయే పరిస్ధితులన్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదు కోవాలని సిపిఎం మండల కార్యదర్శి చాకిరి శివనాగరాజు డిమాండ్‌ చేశారు.ముసునూరు : అన్నదాతను మిచౌంగ్‌ తుపాను నట్టేముంచింది. వరి, పత్తి, మొక్కజొన్న, పొగాకు, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా పొలాల్లోకి భారీగా వర్షపునీరు చేరడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాఅవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై ఉన్న భారీగోతుల్లోకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు అర్బన్‌:మిచౌంగ్‌ తుపాను కారణంగా మంగళవారం ఉదయం నుంచి ఏలూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లు, డ్రెయిన్లు జలమయమయ్యాయి. తంగెళ్లమూడి, ఆదివారపుపేట, పవర్‌పేట, ఆర్‌ఆర్‌.పేట, ఎన్‌ఆర్‌.పేట, పత్తేబాధ, అశోక్‌నగర్‌, అమీనాపేటలతో పాటు వన్‌ టౌన్‌లోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగిపొర్లడంతో రోడ్లు, డ్రెయిన్లు ఏకమై మురుగునీరు రోడ్లపై ప్రవహించింది. పత్తేబాద రైతు బజార్‌ పూర్తిగా నీటమునిగింది. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంతోపాటు ఆసుపత్రి లోపలికి కూడా వర్షం నీరు చేరడంతో మోటార్లతో నీటిని తోడాల్సి వచ్చింది. డిఇఒ కార్యాలయం, రిజిస్ట్రార్‌ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు వర్షం నీటితో నిండిపోయాయి. ఇండోర్‌ స్టేడియం మైదానం నీటితో నిండింది. నూజివీడు రూరల్‌ : తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని ఎపిఎస్‌ఆర్‌టిసి బస్టాండ్‌ ఆవరణ జలమయమైంది. మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరుగుదొడ్ల వద్ద ఉన్న డ్రెయినేజీ పూడుకుపోవడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక బస్టాండ్‌ ఆవరణ మొత్తం నీటమునిగింది. నేడు విద్యా సంస్థలకు సెలవు : కలెక్టర్‌ ఏలూరు:మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ఈ నెల ఆరో తేదీ బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. వర్షాలు ఏకథాటిగా కురుస్తున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.పోటెత్తిన ఉప్పుటేరుకలిదిండి : తుపాన్‌ ప్రభావంతో మండలంలోని ఉప్పుటేరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పుటేరుకు కలిసే ప్రధాన డ్రెయిన్‌లు ఎగదన్నడంతో పల్లపు ప్రాంతాల్లోని వర్షపునీరు పారుదలలేక నెమ్మదించాయి. స్థానిక లాల్వా డ్రెయిన్‌కు ఉప్పుటేరు నీరు ఎగదన్నింది. బస్టాండ్‌ సమీపంలో రాష్ట్రీయ రహదారిపై, కోట కలిదిండికి వెళ్లే ఇరు మార్గాల్లో మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరింది. సర్పంచి ఎం.మారుతీ ప్రసన్న వెంకటేశ్వరరావు నీటి తొలగింపు చర్యలు చేపట్టారు. బస్టాండ్‌ వెనుక చెరువు నిండి రోడ్లపైకి నీరు చేరింది. సమీప ఇళ్లల్లోకి నీరు చేరింది. గ్రంథాలయం చుట్టూ నీరు చేరింది. ఆక్వా చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. గట్లు తెగిపోతే తీవ్రనష్టం వాటిల్లుంతుందని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.

➡️