వరద ఉధృతికి కారంచేడు విలవిల

Dec 7,2023 00:03

ప్రజాశక్తి-కారంచేడు; తుఫాన్‌ వల్ల ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి కారంచేడు రైతులు విలవిల్లాడుతున్నారు. ఎగువ ప్రాం తాల నుంచి పర్చూరు వాగుకు వరద ఉధృతంగా రావడంతో వాగులకు గండ్లు పడి వరద నీరు పంట పొలాలపైకి మళ్లింది. కారం చేడు, స్వర్ణ ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునిగి.. సముద్రాన్ని తలపిస్తోంది. పర్చూరు వాగుకు కారంచేడుకు సమీపంలో దక్షిణం వైపు ఉన్న కప్పలవాగు, మొండివాగులకు మంగళవారం రాత్రి వరద ఉధతి పెరిగి గండ్లు పడటంతో కారంచేడు, స్వర్ణ, తిమిడితపాడు, ఆదిపూడి ప్రాంతాల్లో వరి, మిర్చి, పొగాకు, శనగ పం టలు నీట మునిగిపోయాయి. దీంతో రైతులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళనలో ఉన్నారు. కారంచేడు, స్వర్ణ ప్రధాన రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. స్వర్ణ, తిమ్మిడితపాడు మధ్యలో ఉన్న కాలువపై కల్వర్టు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కారంచేడు, ఆదిపూడి ప్రధాన రహదారి నాలుగు కిలోమీటర్ల మేర పూర్తిగా నీట మునిగింది. ఆ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధతిని తెలుసుకున్న చీరాల ఆర్డీఒ సరోజిని, ఇరిగేషన్‌ ఈఈ మురళీకష్ణ, తహశీల్దారు వెంకటరత్నం, ఎంపీడీఒ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు బుధవారం కాలువలపై పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూటి కాడలను వెంటనే తొలగించే ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మట్టి తవ్వకాల వల్లే గండ్లు: ఏలూరిపర్చూరు వాగులో అక్రమ మట్టి తవ్వకాలు విపరీతంగా చేయడం వలన గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయని ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆరోపించారు. కారంచేడు ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు.

➡️