వడగాల్పులతో ఉక్కిరిబిక్కి

Mar 30,2024 21:29

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినట్లే శనివారం పట్టణంలోని వడ గాలుల తీవ్రతంగా వీచాయి. రోడ్ల మీదకు వచ్చేందుకు ప్రజలు ఆసక్తి చూపించలేదు. ఉదయం 7 గంటల నుండి బానుడు తన ప్రతాపం చూపించడంతో, ప్రజలు తన రోజువారి పనులు వేగంగా ముగించి ఇళ్లకు పరుగులు తీశారు. ఒకపక్క ఎండ వేడి, మరోపక్క, ఉక్క పోత, ఇంకొపక్క వడగాలులు అధికంగా వీచడంతో రోడ్లపై జనసంచారం లేక రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి. మే నెలలో ఉండవలసిన వాతావరణ పరిస్థితి, మార్చి నెలలోనే ఉండడంతో రానున్న రెండు నెలలు వాతావరణం ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఎండల తీవ్రత జాగ్రత్తలు పాటించాలిగరుగుబిల్లి : ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో వడదెబ్బకు గురి కాకుండా ఉండేలా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని మండల పరిధిలోని రావివలస ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కె కార్తీక్‌ వెల్లడించారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరుబయట పని చేసేవారు ఏదైనా పనినిమిత్తం బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. తరచూ నీళ్లు తాగడంతో పాటు డిహైడ్రేషన్‌ తలెత్తకుండా చూసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తెలుపు లేతరంగుల పలుచటి కాటన్‌ వస్త్రాలు ధరించాలన్నారు. తలపై టోపీ పెట్టు కోవాలని, రుమాలు చుట్టు కోవాల్సి ఉందన్నారు. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌, వంటివి తాగాలని తెలిపారు. ఎండలో పనిచేసేవారు ఇబ్బందిగా అనిపిస్తే తక్షణమే చల్లని ప్రదేశంలో సేద తీరాలన్నారు. అధిక వేడివల్ల ఆహారం త్వరగా పాడవుతుందని అటు వంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దని వైద్యాధికారి డాక్టర్‌ కార్తీక్‌ సూచించారు.

➡️