వంశధారలో జనసందోహంఘనంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థం

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగేశ్వరుని

చక్రతీర్థ స్నానాలకు బారులు తీరిన యాత్రికులు 

శ్రీకాకుళం అర్బన్‌, జలుమూరు :

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలకు యాత్రికులు పోటెత్తారు. జిల్లా నుంచే కాక విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రం నుంచీ యాత్రికులు వేలాదిగా చక్రతీర్థ స్నానాలకు తరలివచ్చారు. స్వామివారి ఆలయాన్ని సందర్శనానికి ఆదివారం అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. సోమవారం మధ్యాహ్నం 12.10 నిమిషాలకు ఆలయ ప్రవేశాన్ని నిలుపుదల చేసి అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం పార్వతీ సమేతుడైన శ్రీముఖలింగేశ్వరుని ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించి శాస్త్రోక్తంగా బయటకు తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణం నుంచి నంది వాహనంపై ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి అనంతరం తిరువీధి ప్రారంభమైంది. నంది వాహనంపై ఉత్సవమూర్తులను ఆలయానికి ఉత్తర దిశగా ఉన్న మిరియాప్పల్లి వంశధార రేవు వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్వామివారికి స్నానాలు ఆచరించిన అనంతరం లక్షలాది మంది యాత్రికులు చక్రతీర్థ స్నానాలు ఆచరించారు. వంశధార నదికి ఇరువైపులా కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశారు. చక్రతీర్థ స్నానాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం నుంచి మిరియాపల్లి రేవు వరకు భద్రతను ఎస్‌పి జి.ఆర్‌.రాధిక స్వీయ పర్యవేక్షణలో కొనసాగింది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన యాత్రికులకు పలు గ్రామాల వద్ద అన్న సంతర్పణ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు మజ్జిగ, తాగునీటి ప్యాకెట్లను అందజేశాయి. వేడుకగా సాగిన ఈ యాత్రలో గతేడాది కంటే ఈసారి రెట్టింపు యాత్రికులు రావడంతో వంశధార నదిలో ఎక్కడ చూసిన జనమే కనిపించారు.

 

➡️