రైలు గేటు ముసివేస్తే పొలాలకు ఎలా వెళ్లాలి?

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : రైలు గేటు ముసివేస్తే ఆందోళన చేస్తామని అధికారులను రైతులు హెచ్చరించారు. రైలు గేటు ముసివేస్తే పంటపొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. మండలంలోని అబ్బూరు – గుడిపూడి మార్గంలో ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేటు నం.34ను మూసివేసేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. తహశీల్దార్‌ సురేష్‌, రైల్వే అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ టివి కృష్ణయ్య శనివారం రైల్వే గేటును సందర్శించి రైతులతో మాట్లాడారు. రైల్వే గేటు ముసివేస్తే పొలాలకు వెళ్లాలంటే లక్మిపురం మీదుగా కాల్వ కట్టపై వెళ్లాల్సి ఉంటుందని, రైతులు వివరించారు. గతంలో పాకాలపాడు, పాలడుగు వరకు రోడ్డు నిర్మించారని, గుంటూరు వెళ్లేందుకు వీలుగా వుంటుందని చెప్పారు. రైల్వే గేటు ముసివేత నిర్ణయాన్ని విరమించు కావాలని రైతులు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని వైసిపి నేతలు, రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే అధికారులు, తహశీల్దార్‌తో ఎంపీ చర్చించారు. అయితే లక్ష్మీపురం (గుడిపూడి స్టేషన్‌) వద్ద ఉన్న రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేటు నెం.33 ని కూడా మూసివేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు గేట్లలో ఏది కావాలో నిర్ణించుకుని ఆ మేరకు రైతులు ఆర్జీనిస్తే పరిశీలిస్తామని అధికారులు చెప్పారు.

➡️