రైతులు అతలాకుతలం

నందివెలుగులో పంటలు పరిశీలించి రైతులతో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి – తెనాలి :
తుపానుతో రైతుల జీవితాలు అతలాకుతులమైనా వారిని పరామర్శించే తీరిక ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన కోసం మండలంలోని నందివెలుగు, పెదరావూరు ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సారథ్యంలో నందివెలుగు కూడలిలో టిడిపి, జనసేన శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నందివెలుగు, అత్తోట రోడ్డులో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎకరానికి చెల్లించిన కౌలు, పెట్టుబడులు, నష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో ఎన్నో తుపానులు సంభవించాయని వాటికి భిన్నంగా, మిచౌంగ్‌ తుపాను విరుచుకుపడిందని అన్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే జూలైలో కురిసిన భారీ వర్షాలకు వరి తీవ్రంగా దెబ్బతిందని, తదుపరి ఎదురైన వర్షాభావ పరిస్థితులనూ రైతులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం కురిసిన వర్షాలకు 90 శాతం పంట నీటిపాలైందని, రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందని అన్నారు. కౌలు రైతులు ఎకరానికి రూ.25 వేలు ముందస్తు కౌలు చెల్లించి, మరో రూ.25 వేలు పెట్టుబడులు పెట్టారని చెప్పారు. అయితే ఇక్కడ మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని, పంట కాల్వలు, డ్రెయినేజీ వ్యవస్థను సరి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో ఆ ప్రభావం రైతులపై పడిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చెల్లించాల్సిన ఫసల్‌ బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫసల్‌ బీమా కేవలం 16 మంది రైతులకే నమోదు కావడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఓ రైతు 20 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడని, కౌలు, పెట్టుబడి కలిపితే దాదాపు రూ.10 లక్షలు వెచ్చించినట్లు చెప్పారని, ప్రస్తుతం గింజ కూడా చేతికి రాని పరిస్థితి ఎదురైతే ఆ రైతు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతులపట్ల ప్రభుత్వ తీరు దారుణమన్నారు. రాష్ట్రం ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంటే అప్పుల్లో మొదటి స్థానంలో ఉందని విమర్శించారు. 2014కు ముందు ఇన్పుట్‌ సబ్సిడీ ఎకరానికి రూ.10 వేలు చెల్లిస్తుంటే దానిని తన హయాంలో రూ.20 వేలకు పెంచామని, ఆ ప్రకారం ప్రస్తుతం ఎకరానికి కనీసం రూ.30 వేలైనా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి ముందుగా పర్యటించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. తుపాను తీరం దాటిన ప్రాంతం ఓ వైపుంటే సిఎం పర్యటన మరోవైపు సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించే గొంతుకను కేసుల రూపంలో ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పూ చేయకపోయినా, అక్రమ కేసులు బనాయించి 52 రోజులు జైల్లో ఉంచారని చంద్రబాబు అన్నారు. అంతిమంగా తనను అంతం చేయడమే లక్ష్యంగా జగన్‌ దక్పథం ఉందని, ఈ నేపథ్యంలో తనకు అండగా నిలిచిన రాజకీయ పార్టీలు, ప్రజలకు కృతజ్ఞతలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అధికారం ఉంది కదా అని విర్రవీగితే తెలంగాణ మాదిరి ఫలితాలే ఎదురవుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు అండగా నిలుస్తామని, సమిష్టిగా పరిహారం కోసం ప్రభుత్వంపై పోరాడుదామని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మూడు నెలల తర్వాత ఆ పరిహారం చెల్లించే బాధ్యత తానే తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, స్థానిక నాయకుల పాల్గొన్నారు.
టిడిపి అధినేతకు ఘన స్వాగతం
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తెనాలిలో ఘన స్వాగతం లభించింది. నందివెలుగు కూడలిలో టిడిపి, జనసేన నాయకులు ఉదయం ఎనిమిది గంటల నుంచి వేచి ఉన్నారు. చంద్రబాబు ఉదయం 9.30 గంటలకు నందివెలుగు వస్తున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించినా ఆయన నందివెలుగు జంక్షన్‌కు చేరుకునేటప్పటికీ దాదాపు 11 గంటలైంది. ఈ నేపథ్యంలో ఆయన రాక కోసం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వేచి ఉన్నారు. నందివెలుగు జంక్షన్లో మహిళలు ఆయనకు హారతి పట్టారు. అక్కడి నుంచి అత్తోట రోడ్డులో పొలాలు పరిశీలించిన చంద్రబాబు తిరిగి నందివెలుగు జంక్షన్‌, కఠెవరం, తెనాలి మీదుగా పెదరావూరు మీదుగా బాపట్ల జిల్లాలో ప్రవేశించారు. దారి పొడుగునా చంద్రబాబును చూసేందుకు, స్వాగతించేందుకు పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నాయకులు వంగా సాంబిరెడ్డి, నన్నపనేని సుధాకర్‌, డాక్టర్‌ వేమూరి శేషగిరిరావు, మహమ్మద్‌ కుద్దూస్‌, టి.హరిప్రసాద్‌, పి.విజరు, పి.త్రిమూర్తి, షేక్‌ గౌసియా బేగం, పరుచూరి రమ్య, బోయపాటి అరుణ, టి.హరిప్రసాద్‌, జె.మహేష్‌, ఎం.విజరు కమార్‌, జనసేన నాయకులు బి.రవికాంత్‌, దివ్యెల మధుబాబు, జాకీర్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

➡️