రైతుల అనుమతి లేకుండా భూములు తీసుకోరాదు

Jan 16,2024 17:51

రైతులతో మాట్లాడుతున్న రైతు సంఘం నాయకులు

రైతుల అనుమతి లేకుండా భూములు తీసుకోరాదు
– ఎపి రైతు సంఘం నేతలు
ప్రజాశక్తి – బనగానపల్లె
బనగానపల్లె మండలంలో రైతులు అనుమతి లేనిదే సోలార్‌కు భూములు తీసుకోరాదని ఎపి రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. సోమవారం మండలంలోని పాతపాడు, పత్తినగరం, కటికబానుకుంట గ్రామాలలో ఎపి రైతు సంఘం జిల్లా బృందం పర్యటించి, రైతులతో మాట్లాడారు. ‘మా తాతల, తండ్రుల కాలం నుంచి ఈ భూమినే నమ్ముకుని, రెక్కల కష్టంతో జీవిస్తున్న మాకు ఉన్న ఈ భూములు పోతే, మా అందరికీ ఆత్మహత్యలు శరణం తప్ప వేరే మార్గం లేదు’ అని రైతులు రైతు సంఘం నాయకులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రాజశేఖర్‌, ఉపాధ్యక్షుడు వి.సుబ్బరాయుడు మాట్లాడారు. పాతపాడు, యాగంటి, మీరాపురం, పత్తే నగరం, కటికవానికుంట గ్రామాలలో సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయుటకు 350 మంది రైతులకు సంబంధించి సుమారు 650 ఎకరాల భూములు అనుమతి లేకుండానే తీసుకుంటున్నట్లు సోలార్‌ ప్రాజెక్ట్‌ వారు ప్రకటించి, ఆ పక్కనే ఉన్న ప్రభుత్వ భూముల్లో ముందుగా డ్రిల్లింగులు చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఇప్పటికే పాణ్యం మండలం, ఓర్వకల్లు మండలాల్లో రైతుల భూములను బలవంతంగా లాక్కొని సోలార్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్టులకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సహకరిస్తున్నారని విమర్శించారు. 2013లో భూసేకరణ చట్టం చేశారని, కానీ ఆ చట్టాన్ని ఎక్కడ కూడా అమలు చేయడం లేదన్నారు. రైతుల భూములు లాక్కోవడానికి అధికార పార్టీ అండతో, సోలార్‌ ప్రాజెక్టు వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. కలెక్టర్‌ జోక్యం చేసుకొని వెంటనే గ్రామ సభలు జరిపి రైతుల అభిప్రాయం తెలుసుకోవాలని, అభిప్రాయానికి వ్యతిరేకంగా భూసేకరణ చేపడితే, ఆయా గ్రామాల రైతులను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆఫీస్‌ ముందు ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సుబ్బయ్య, మద్దిలేటి, పాతపాడు దొర్నిపాటి వెంకటేశ్వర్లు, వెంకట కళాధరుడు, నారాయణరెడ్డి, జే మహేంద్ర, బగడదల సత్యం రెడ్డి, పత్తే నగరం గ్రామ రైతులు ఎల్ల కృష్ణుడు, గోపాల్‌, తిమ్మరాజు, బాబాయ్య, రమణయ్య, రామచంద్రుడు, మద్దిలేటిస్వామి, సురేష్‌ బాబు, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️