రేసులో ఉన్నాను…పార్టీదే తుది నిర్ణయం

Dec 30,2023 15:49
రాబోయే ఎన్నికలలో

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం

రాబోయే ఎన్నికలలో పోటీ చేసే రేసులో తాను ఉన్నానని, అయితే అధిష్టానం పోటీ చేయమంటే ఏ స్థానానికైనా సిద్దమేనని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తెలిపారు. శనివారం నగరంలోని గన్నీస్‌ శుభమస్తు ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభలో ఒక్కసారైనా అడుగు పెట్టాలని ఆశ అయితే ఉందని, అందుకోసమే 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు దగ్గరకు వెళ్ళి చివరిసారిగా అడుగుతున్నానని, ఇకపై సీటు కోసం అడగబోనని స్పష్టం చేసినా తనకు అవకాశం రాలేదని అన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సీటు తనకు కావాలని మాత్రం అధిష్టానాన్ని అడగబోనని, తన సీనియారిటీ, సేవలను గుర్తించి పోటీ చేయాలని కోరితే ఏ స్థానానికైనా చేయడానికి సిద్దమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో తనకు వచ్చిన పదవులను నిజాయితితో నిర్వర్తించానని, కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాలు చేసే విధానం తనది కాదన్నారు. అయితే దేశ, విదేశాలలో ఉన్న మిత్ర బృందం ఎన్బి కోట్లు ఖర్చయినా భరించడానికి సంసిద్దులుగా ఉన్నారని తెలిపారు. తనకు సీటు రావడానికి ముఖ్యంగా కావలసిన అర్హత సీనియారిటీ, పార్టీకి సేవ, పోరాట నేపథ్యం చూడాలని అన్నారు. ధనమే ముఖ్యమనే రాజకీయాల కంటే తనకు ఆత్మాభిమానమే ప్రాముఖ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి సమర్థవంతమైన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే భవిష్యత్తు తరాలకు తీవ్ర అన్యాయం చేసిన వారమవుతామని అన్నారు. ఒక దశలో రెండు పర్యాయాలు తనని పోటీ చేయమని స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారని, కానీ కొంతమంది నాయకులు తనను తప్పుకోమని సూచించడం వల్ల ఆనాడు పోటీ బరిలోంచి తప్పుకున్నట్లు చెప్పారు. తన విషయంలో చంద్రబాబు తప్పు లేదని అన్నారు.

➡️