రేపటి నుంచి అంగన్వాడీ కేంద్రాలను నడపాలి : కలెక్టర్‌

Dec 16,2023 20:33

ప్రజాశక్తి-విజయనగరం  : అంగన్వాడీ కార్యకర్తల సమ్మె కారణంగా బాలింతలకు, గర్భిణీలకు, పిల్లలకు అందాల్సిన ఆహారం ఎటువంటి ఆటంకం కలగకుండా అందేలా చూడాలని అధికారులకు కలెక్టర్‌ నాగలక్ష్మి సూచించారు. ఇప్పటికే 80 శాతం వరకు అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని, మిగిలినవి కూడా స్వాధీనం చేసుకొని సోమవారం నుండి పూర్తి స్థాయి లో నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంగన్వాడీ సమ్మె పై మంత్రుల బృందంతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయని, ప్రభుత్వం మరి కొంత సమయం కోరిన నేపథ్యం లో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను నడపాలని సూచించినట్లు తెలిపారు. సిడిపిఒలు, ఎంపిడిఒలు, పంచాయతీరాజ్‌ అధికారులతో శనివారం కలెక్టర్‌ వెబ్‌ కాన్ఫెరెన్సు నిర్వహించారు. కేంద్రాల కార్యకర్తలతో సున్నితంగా మాట్లాడి, సిడిపిఒలు, సూపర్‌వైజర్లు సచివాలయ సిబ్బంది సహకారం తో డ్వాక్రా మహిళలు, తల్లుల సహకారాన్ని తీసుకొని సమీప పాఠశాలలలో మధ్యాహ్న భోజనాన్ని వండి అంగన్వాడీ కేంద్రాల్లో వడ్డించాలని తెలిపారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రం కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసారని తెలుస్తోందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలని, అక్కడి సొత్తు ప్రభుత్వానికి చెందినదని, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్స్‌ తో మాట్లాడి విషయాన్నీ సున్నితంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ సిబ్బంది తోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలన్నారు. స్టాక్‌ రిజిస్టర్లను వేరే గా నిర్వహించాలని, తిరిగి అప్పజేప్పేటప్పుడు స్టాక్‌ ను సక్రమంగా అప్పగించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న స్టాక్స్‌ ను వీడియో చేసి ఉంచాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 9 నుండి 12 వరకు కేంద్రాలను తెరిచి ఉంచాలని అన్నారు. వెంటనే ఎంపిడిఒలు , సిడిపిఒలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ రాజ్‌ కుమర్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ నిర్మల దేవి, డిఆర్‌డిఎ పీడీ కళ్యాణ చక్రవర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీరాములు నాయుడు, డిఇఒ లింగేశ్వర రెడ్డి, మెప్మా పీడీ సుధాకర్‌ పాల్గొన్నారు.

 

➡️