రేగిడి, వెంకటాపురం కేంద్రంగాఇసుక అక్రమ రవాణా

Mar 24,2024 20:01

 ప్రజాశక్తి-రేగిడి : మండలంలో ఇసుకాసురుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. రేగిడి, కొమిరి వెంకటాపురం గ్రామాల కేంద్రంగా నాగావళి నది నుంచి ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులు లేకుండా, అడ్డు, అదుపు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సర్కారు ఆదాయానికి గండికొట్టి ఇసుకాసురులు రూ.లక్షల్లో కాసులు వెనకేసుకుంటున్నారు.రేగిడి మండల కేంద్రానికి కూతవేటులో ఉన్న నాగావళి నది నుంచి రేయింబవళ్లు ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అయినా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు, రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొమిరి వెంకటాపురం గ్రామం నుంచి రోజువారిగా వందలాది లారీలు, ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా జరిగినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇసుక అక్రమ రవాణాలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పత్రికల్లో ఎన్నోసార్లు ఇసుక అక్రమ రవాణాపై కథనాలు వస్తే వారం రోజుల వరకు ఇసుక రవాణా ఆపేసి, ఆ తరువాత దందా ప్రారంభిస్తున్నారు. దీని వెనుక నేతలు లేకుంటే ఇసుక అక్రమ రవాణా ఎలా జరుగుతుందని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఉంగరాడ, బూరాడ గ్రామ జంక్షన్‌లో చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ పోలీసులు తనిఖీలు నిర్వహించకుండా, ఇసుక లారీలు, ట్రాక్టర్లను వదిలేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

➡️