రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి: డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌ : రుణాలు ఇవ్వడం బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. వ్యవసాయం, హౌసింగ్‌, విద్యా రుణాలకు బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదన్నారు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్‌ టైం సెటిల్మెంట్‌ చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలని సూచించారు.

రానున్న ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తామని చెప్పారు. మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం. బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించండి. రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

➡️