కాంగ్రెస్‌తోనే ‘హోదా’-రాహుల్‌ తొలి సంతకం దానిపైనే

Mar 1,2024 22:18 #speech, #ys sharmila

-మోడీ ని కేడీ అనక ఇంకేం అంటాం

– తిరుపతి న్యాయసాధన సభలో వైఎస్‌ షర్మిల

బిజెపిని, దానికి మద్దతిచ్చే వారిని ఓడించాలి: నారాయణ

– మోడీ, బాబు, జగన్‌, పవన్‌లతో పోరాడాలి : గఫూర్‌

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో:కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తుందని పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి ఎస్‌ వి మైదానంలో శుక్రవారం న్యాయ సాధన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన షర్మిల మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలుపైనే చేస్తారని చెప్పారు. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కానీ, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుకానీ హోదా కోసం నామమాత్రపు పోరాటం కూడా చేయలేదని చెప్పారు. ‘ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్లు కావాలా? తాకట్టు పెట్టే వాళ్లు కావాలా?’ అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే చిత్తశుద్దితలో ఉందన్నారు. ‘ప్రధాన మంత్రి మోడీ తనను రామభక్తుడినని చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇదే తిరుపతిలో ఏడుకొండలవాడి సాక్షిగా విభజన చట్టం హామీలను అమలు చేస్తామని , ప్రత్యేకహోదా ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. మోడీని కేడీ అనక ఇంకేమనాలి’ అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఢిల్లీని తలపించే రాజధానిని తీసుకొస్తానని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, గోదావరి జిల్లాలో పెట్రోల్‌, కెమికల్‌ యూనివర్సిటీ, కడపకు ఉక్కు పరిశ్రమ తీసుకువస్తామని 2014లో ఇదే స్టేడియంలో మోడీ ఇచ్చిన హామీలను ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆంధ్రాలో బిజెపికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపి స్థానం కూడా లేదని, అయినా రాజ్యమేలుతోందన్నారు. మోడికి జగనన్న, చంద్రబాబునాయుడు బానిసలుగా మారిపోవడం వల్లే ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఈ గతి పట్టిందన్నారు. జగనన్న మూడు రాజధానులంటూ నాటకాలాడుతున్నారని, ఒక్క రాజధానినైనా అభివృద్ధి చేశారా? అని ప్రశ్నించారు. ఉత్తరఖాండ్‌కు ప్రత్యేక హోదా రావడంతో రెండువేల పరిశ్రమలు వచ్చాయని, అక్కడి యువతకు ఆర్థిక భరోసా లభించిందని తెలిపారు.

ఎఐసిసి ప్రధాన కార్యదర్శి సచిన్‌ పైలెట్‌ మాట్లాడుతూ.. సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని, ఎస్‌సి, ఎస్‌టిలకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చంద్రబాబుగాని, జగన్‌ గాని ఆందోళనలు చేసిన సందర్భాలు లేవని విమర్శించారు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ, టిడిపి పాలనలో అమరావతి రాజధాని ఏర్పాటు సందర్భంగా మోడీ రూ. పదివేల కోట్లు ఇస్తారని అందరూ ఊహించారని, అయితే మట్టి, నీళ్లు మోహం మీద కొట్టారన్నారు. బిజెపితో పాటు దానికి మద్దతిచ్చే వారినీ రాష్ట్రంలో ఓడించాలని చెప్పారు.

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం తుదికంటా నిలబడిన పార్టీ సిపిఎం అని అన్నారు. ప్రత్యేక హోదా సాధించాలని కాంగ్రెస్‌ చేస్తున్న న్యాయ సాధన పోరాటం విజయవంతం కావాలని కాంక్షించారు. 25 ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డి, ఢిల్లీ వెళ్లి మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలోని మోడీతోనూ, రాష్ట్రంలోని బాబు, జగన్‌, పవన్‌తోనూ ఆంధ్రప్రజలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ హఠావో పిలుపుతో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఆమ్‌ఆద్మీ పార్టీలు పనిచేయాల్సిన సమయం ఆసన్నమయ్యిందన్నారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ నాయకులు మణి నాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటంలో తమ పార్టీ సైతం భాగస్వామ్యం అవుతుందన్నారు. ఈ బహిరంగసభలో కేంద్ర మాజీ మంత్రులు చింతామోహన్‌, జేడీ శీలం, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గిడుగు రుద్రరాజు, కెవిపి రామచంద్రరావు, ఎన్‌.రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, కాంగ్రెస్‌ తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు భాస్కర్‌, సిపిఎం చిత్తూరు, తిరుపతి జిల్లా కార్యదర్శులు వాడా గంగరాజు, వందవాసి నాగరాజు, సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళి తదితరులు పాల్గొన్నారు.

➡️