రాష్ట్రస్థాయి ఎన్నికలకు సంసిద్ధులు కావాలి

రాష్ట్రస్థాయి ఎన్నికలకు సంసిద్ధులు కావాలి

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆల్‌ మేవా జిల్లా అధ్యక్షులు వై.షేక్షావలి

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

ఆల్‌ మైనార్టీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఆల్‌ మేవా) రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఈనెల 25న కర్నూలులో నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పని చేస్తున్న ముస్లిం మైనార్టీ క్రిస్టియన్‌ ఉద్యోగులు సంసిద్ధులు హాజరుకావాలని ఆల్‌ మేవా జిల్లా అధ్యక్షులు వై.షేక్‌షావలి పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆల్‌ మేవా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తొలుత నంద్యాలలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ. 12 కోట్ల వ్యయంతో 6 నూతన ఉర్దూ జూనియర్‌ కళాశాల, మైనార్టీ వసతి గృహం, వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌, సద్భావన బిల్డింగు, ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ విద్యార్థుల నూతన భవనాల నిర్మాణానికి కృషి చేసిన సిఎం జగన్‌కి ఆల్‌మేవా సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముస్లిం మైనారిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం నిర్దేశించిన ప్రధానమంత్రి 15 సూత్రాల మైనార్టీ పథకాన్ని జిల్లాలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో 15 శాతం రిజర్వేషన్లు మైనార్టీలకు అమలు చేయాలని, రాష్ట్రంలో దురాక్రమణలకు లోనైనా వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్‌మేవా రాష్ట్ర సహాధ్యక్షులు ఫక్రుద్దీన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫరూక్‌ అహ్మద్‌, జిల్లా కోశాధికారి దౌలా, ఉపాధ్యక్షులు జిలాన్‌, అశ్రఫ్‌ అలీ, ఏఎం బాషా, అన్వర్‌ అబ్దుల్‌రసూల్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️