రాష్ట్ర ప్రభుత్వం ఎవరి పక్షం?

రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షం వహిస్తుందా? దళారుల పక్షం వహిస్తుందో స్పష్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఎన్‌.గణపతి అధ్యక్షతన

సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు

జీడికి మద్దతు ధర ప్రకటించాలి : సిపిఎం

ప్రజాశక్తి – పలాస

రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షం వహిస్తుందా? దళారుల పక్షం వహిస్తుందో స్పష్టం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఎన్‌.గణపతి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పలాస వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జీడిపిక్కలకు మద్దతు ధరపై ఒక మాట కూడా చెప్పకపోవడం శోచనీయమన్నారు. ఏడాదిగా జీడి రైతులు మద్దతు ధరకు పలురూపాల్లో పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. లక్ష సంతకాలతో సిఎంకు వినతిపత్రం ఇస్తే చర్చిస్తామని హామీనిచ్చినా, చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ అండతో జీడి యాజమాన్యాలు సిండికేట్‌గా మారి తక్కువ ధర ఇచ్చి జీడి రైతులను దోచుకుంటున్నాయని వారు విమర్శించారు. విత్తనం నుంచి విక్రయం వరకు ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం జీడిపిక్కలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. స్థానిక మంత్రి అప్పలరాజు జీడి గిట్టుబాటు ధరపై ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర చెల్లించి, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని, కేరళ తరహాలో జీడి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, స్థానిక రైతుల నుంచి పిక్కల కొనుగోలు చేశాకే విదేశీ పిక్కల దిగుమతికి అనుమతించాలన్నారు.

 

➡️