రాయితీ విద్యుత్‌కు దరఖాస్తు చేసుకోండి

ఎపి రొయ్య రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జికె. సుబ్బరాజు

ప్రజాశక్తి – వీరవాసరం

గతంలో విద్యుత్‌ రాయితీ పొందలేకపోయిన వారు, కొత్తగా ఆక్వాసాగు చేస్తున్న పది ఎకరాల్లోపు ఉన్న రైతులు ప్రభుత్వం కల్పించిన విద్యుత్‌ రాయితీ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఎపి రొయ్య రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జికె.సుబ్బరాజు తెలిపారు. వీరవాసరంలో తులసీ కన్‌వెన్షన్‌ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. గతంలో కొంతమంది రైతులు తమ ఆక్వాసాగుకు సంబంధించిన వివరాలు సాంకేతిక లోపంతో ఆక్వా చెరువుగా మ్యాపింగ్‌ జరగలేదని, ఈ విషయాన్ని అప్సడ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ వడ్డె రఘరాం సిఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఆయా రైతులు వెంటనే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశాలిచ్చారని తెలిపారు. అవకాశం ఉన్న ఆక్వా రైతులు తక్షణం రాయితీ విద్యుత్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం రాయితీ విద్యుత్‌ ఇప్పిస్తామంటూ కొంత మంది దళారులు బయలుదేరారన్నారు. అవటువంటి వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అప్సడ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ వడ్డె రఘరాంకు క్యాబినెట్‌ హోదా కల్పించడం పట్ల ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ క్యాబినెట్‌ హోదా వల్ల మరింత సులభతరం అవుతుందని తెలిపారు. అనంతరం రొయ్య రైతుల సంక్షేమ సంఘం జాయింట్‌ సెక్రటరీ మళ్ల రాంబాబు మాట్లాడారు. వీరవాసరం మండల రొయ్య రైతుల సంఘం నాయకులు నాగరాజు గోపాలకృష్ణంరాజు, యరకరాజు గోపాలకృష్ణంరాజు, భోగిరెడ్డి శ్రీనివాసరావు, గుండా నరసింహరావు, జుత్తిగ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️