రాయలసీమ కంటే వెనుకబడిన పల్నాడు

Feb 4,2024 00:29

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి గుంటూరు జిల్లా పేరు గాంచిందని, అయితే ఎగువ పల్నాడు ప్రాంతమైన దుర్గి, వెల్దుర్తి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాలు కరువు కోరల్లో చిక్కుకుని అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య అన్నారు. వరికపూడిశెల ప్రాజక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. నరసరావుపేటలోని స్థానిక కోటప్పకొండ రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో వరికిపూడిశెల జలసాధన సమితి కమిటీ సభ్యుల సమావేశం శనివారం జరిగింది. చలమయ్య మాట్లాడుతూ రాయలసీమ కంటే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పల్నాడు ఉందంన్నారు. వెయ్యి అడుగులకు పైగా బోర్లు వేసినా రోజు మొత్తం 3 బిందెల నీరు రావడం కష్టంగా ఉందని, కుటుంబం మొత్తం రోజంతా ఆ నీటితోనే గడుపుకోవాల్సిన పరిస్థితి ఆయా మండలాల్లో ఉందని చెప్పారు. ఈ విషయంలో పాలకులు సిగ్గుపడాలన్నారు. వరికిపూడిశెల ఎత్తిపోతల పథకం కోసం గతంలో సిఎంలుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపనలు చేసినా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదన్నారు. రూ.2.50 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర బడ్జెట్‌ రూ.47 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఈ దేశంలో ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నారని, వీటిల్లో వరికిపూడిశెల ప్రాజెక్టుకు నిధులు ఖర్చు పెట్టలేరా? అని ప్రశ్నించారు. ఆర్థికంగా, విద్య, వైద్య పరంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పల్నాడు ప్రాంతంలో బంగారం లాంటి భూములున్నా సాగునీరు లేక భూములు పడావుగా మారాయన్నారు. నాగార్జునసాగర్‌ నిర్మించిన సమయంలో పార్లమెంట్లో చర్చ జరిగితే నిర్వాసితులందరికీ లిఫ్ట్‌ ద్వారా నీరు ఇస్తామని పార్లమెంట్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల అవసరాల కోసమే ఆయా రాజకీయ పార్టీల ముఖ్యమంత్రులు వరికిపూడిశెలకు శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. ఆయా మండలాల ప్రజలను కదిలించి నందికొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఏ విధంగా ప్రజా ఉద్యమం కొనసాగిందో అదే రీతిలో వరికిపూడిశెల కోసం ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ వరికిపూడిశెల ఎత్తిపోతల పథకం పల్నాడు ప్రజలకు అందుబాటులోకి వస్తే 100 గ్రామాలకు తాగునీరు, లక్ష ఎకరాలకు పైగా సాగునీరు లభిస్తుందని, వ్యవసాయ బోర్లలో కూడా నీరు పుష్కలంగా ఉంటుందని తెలిపారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా మారి ఆ ప్రాంత ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. ప్రభుత్వ స్పందించి తక్షణమే స్పందించి వరికిపూడిశెల పనులు ప్రారంభించకుంటే కలిసొచ్చే పార్టీలను ఐక్యం చేసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో కౌలురైతు సంఘం మండల కార్యదర్శి కె.ఆంజనేయులు, వరికిపూడిశెల జలసాధన సమితి కమిటీ సభ్యులు కె.హనుమంతరెడ్డి పి.శ్రీను, బి.వీరయ్య, బి.సుబ్బారావు, బి.గురువులు పాల్గొన్నారు.

➡️