ఎంపి టికెట్‌ వివాదమే వివేకా హత్యకు కారణం- దస్తగిరి

Mar 6,2024 08:12 #dastagiri, #press meet

ప్రజాశక్తి – కడప అర్బన్‌: ఎంపి టికెట్‌ వివాదమే వివేకా హత్యకు దారి తీసిందని అప్రూవర్‌ దస్తగిరి తెలిపారు. వివేకా హత్య కేసులో శిక్ష పడేది తనకే అని తెలుసని, చేసిన తప్పుకు పశ్చాతాపపడుతున్నానని చెప్పారు. కడప ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సాక్షి దినపత్రికలో వచ్చిన వివేకా హత్య కథనంలో గొడ్డలి నా చేతిలో పెట్టడం కంటే హత్యను ప్రోత్సహించిన సిఎం జగన్‌, ఎంపి అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి చేతిలో పెట్టి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తోందనే సమాచారం వచ్చిన వెంటనే సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తారని విమర్శించారు. జైలులో దస్తగిరిని బిటెక్‌ రవి కలవకూడదని జైలు సూపరింటెండెంట్‌ నోటీసు అతికించారని, మరి చైతన్యరెడ్డికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. సిసి పుటేజ్‌ను భద్రపరచాల్సిన బాధ్యత జైలు అధికారులదేనన్నారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌ వీడియోను సిబిఐ బయటకు తీసిందని, అలాంటిది ఈ సిసిపుటేజ్‌ తియ్యడం ఒక లెక్కకాదన్నారు. నా భార్య మానసిక పరిస్థితి బాగోలేదని జైలు అధికారులు లేఖ రాయమన్నారని, అందుకు నేను తిరస్కరించానని తెలిపారు. అయితే ములాఖత్‌ ఇవ్వబోమని జైలు అధికారులు బెదిరించారని ఆరోపించారు. వివేకాను చంపింది ఎవరో ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ప్రస్తుత పరిణామాలను సిబిఐ, జైళ్ల శాఖ డిజి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. జైబీమ్‌ పార్టీ తరపున పులివెందుల నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తానని, హత్యను ప్రోత్సహించే వారు ఎన్నికల్లో ఓట్లు అడుగుతుంటే తాను ఎందుకు అడగకూడదో చెప్పాలని ప్రశ్నించారు. వివేకానంద అభిమానులకు, ఎర్రగుంట్ల సంఘటన విషయంలో దళితులకు క్షమాపణ చెబుతున్నానని చెప్పారు.

➡️