రాగిపిండి పంపిణీ ప్రారంభం

Mar 2,2024 20:14

 ప్రజాశక్తి-విజయనగరం :  ఎండియు వాహనాల ద్వారా రాగిపిండి పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ ప్రారంభించారు. స్థానిక కెఎల్‌పురం రామమందిరం వద్ద శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో లబ్దిదారులకు రాగిపిండి ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం బలవర్ధక పోషకాహారమైన రాగిపిండిని ప్రభుత్వం సరఫరా చేస్తోందని చెప్పారు. కిలో రాగిపిండి ప్యాకెట్‌కు కార్డుదారులు రూ.11 చెల్లించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రాగిపిండి కావాల్సిన వారికి ఒక కిలో బియ్యం తగ్గించి ఇస్తారని చెప్పారు. అనంతరం రేషన్‌ సరుకుల సరఫరాను తనిఖీ చేశారు. బయోమెట్రిక్‌ పనిచేయనివారికి ఐరిష్‌ ద్వారా రేషన్‌ సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరా అధికారి కె.మధుసూదనరావు, తాహశీల్దార్‌ ఎవి రత్నం, సిఎస్‌డిటి రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️