రవికుమార్‌కు రాష్ట్రపతి ప్రశంసలు

సిక్కోలు యువకుని ప్రతిభకు రాష్ట్రపతి
  • మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ విభాగంలో జిల్లావాసి రాణింపు
  • గతేడాది 1.60 లక్షల కంపెనీల ఏర్పాటుకు అనుమతులు జారీ

ప్రజాశక్తి – శ్రీకాకుళం

సిక్కోలు యువకుని ప్రతిభకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రశంసలు లభించాయి. 2016 సివిల్స్‌ బ్యాచ్‌కు చెందిన మెట్ట రవికుమార్‌ ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రీ ఆఫ్‌ కంపెనీగా పనిచేస్తున్నారు. తన నాయకత్వంలో 2023లో దేశంలో అత్యధికంగా 1.60 లక్షల కంపెనీల ప్రారంభానికి అనుమతులు జారీ చేసి రికార్డు సృష్టించారు. ఆయన ప్రతిభను మెచ్చిన రాష్ట్రపతి పార్లమెంట్‌ ఉభయ సభల బడ్జెట్‌ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఒక కంపెనీకి అనుమతులు ఇవ్వాలంటే 15 రోజులు దాటేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా కేవలం ఒకట్రెండు రోజుల్లోనే అనుమతులు ఇచ్చి కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్న రవికుమార్‌తో పాటు ఆయన బృందాన్ని రాష్ట్రపతి మెచ్చుకున్నారు. కుమారుడు విధుల్లో చూపుతున్న చిత్తశుద్ధి, సాధించిన ఘనతపై శ్రీకాకుళం నగరంలో నివసిస్తున్న ఆయన తల్లిదండ్రులు మెట్ట సత్యనారాయణ, వెంకటరత్నం హర్షం వ్యక్తం చేశారు. విధుల్లో రాణిస్తూ రాష్ట్రపతి ప్రశంసలు అందుకోవడంపై రవికుమార్‌ స్వగ్రామమైన ఎచ్చెర్ల మండలం సనపలవాని పేటలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

➡️